02-07-2025 01:16:51 AM
-గల్లీకో బెల్ట్ షాపు... అధిక ధరలకు విక్రయాలు
-మామూళ్ల మత్తులో అధికారులు..
-కలెక్టర్ పట్టించుకోవాలంటూ విన్నపం
సిద్దిపేట, జూలై 1(విజయక్రాంతి) : గ్రామాల్లో మద్యం విచ్చలవీడిగా విక్రయిస్తున్నారు. గల్లీకో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు మద్యం విక్రయిస్తుంటే సంబందిత శాఖల అధికారులు మామూళ్లు తీసుకుని చూసిచుడనట్లు వ్యవహరిస్తున్నారు. తెల్లవారగానే మద్యంతోనే మోఖం కడుక్కునే పరిస్థితి గ్రామాల్లో నెలకొన్నదంటే ఆశ్చర్యం లేదు. లక్షలు పెట్టుబడి పెట్టి మద్యం దుకణాలు దక్కించుకున్న వ్యాపారులు సైతం బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
వైన్ షాపులో నిల్వలు ఉండటం లేదంటే ఆ ప్రాంతంలో బెల్ట్ షాపులు జోరుగా సాగుతున్నాయని అర్థం. ఇంటి పక్కాన్నే, గల్లీలోనే, గ్రామంలోనే అనుకున్న సమయానికి మద్యం లభించడం, అవసరమైతే ఉద్దెర ఇవ్వడం ఇలాంటివి నేటి యువతకు అవకాశాలుగా మారాయి. స్కూల్ పిల్లల నుంచి ఉద్యోగుల వరకు, దినసరి కూలీ నుంచి ఆసామూల వరకు బెల్ట షాపులకు వేళ్లాల్సిందే మద్యం సేవించాల్సిందే ఇందుకు ప్రదానమైన కారణం అనుకున్న సమాయానికి కావాల్సిన బ్రాండ్ అందుబాటులో ఉండటమే. దాంతో బెల్ట్ షాపుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంటే, ఆ పరిధిలోని పోలీసులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ప్రతినెల మామూళ్లు మూడుతున్నాయి.
దారుణాలకు దారి....
పచ్చని కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతుందని చెప్పక తప్పదు మరి. గ్రామాల్లో భార్యభర్తలు కూలీపని చేసుకుని కుటంబాన్ని పోషించుకుంటున్న వారికి మద్యం అందుబాటులో ఉండటంతో భర్త ప్రతి రోజు మద్యం సేవించటం అలవాటుగా మారుతుంది. పోద్దున లేస్తేనే భర్త తాగటంతో కూలీ పనికి వెళ్లలేని పరిస్థితి, ఇలా రోజులు గడిచకా భర్తకు నరాలు చచ్చుపడి పని చేయాలేని స్థితి ఏర్పాడుతుంది. దాంతో తనకు మద్యం తాగకపోతే బ్రతకలేనని డబ్బుల కోసం భార్యను హింసించడం, గోడవ పటడం, కొట్టడం, కొన్ని సందర్భాల్లో చంపడం వంటివి జరుగుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ఇక యువత మాత్రం మద్యానికి బానిసై చదువు, పని మానుకుని జూలాయిగా తిరుగుతు తల్లిదండ్రులను హత్యలు చేసేంత వరకు దారితీస్తున్న సంఘటనలు ఏదో ఒకచోట జరుగుతున్నాయి. మద్యానికి తోడుగా గుట్కా, గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు సైతం అందుబాటులో ఉండటంతో వాటిని సేవించిన యువకులు, సోషల్ మీడియా ద్వారా చిత్రవిచిత్రాలకు పాల్పపడుతూ వారి సమీపకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే పోలీసులు హడాహుడి చేయటం తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు.
సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 93 మద్యం దుకాణాలు(లైసెన్స్ ఉన్నవి) కోనసాగుతున్నాయి. కాని ప్రతి మేజర్ గ్రామంలో కనీసం 10 కి తగ్గకుండా జిల్లా మొత్తంలో 4 వేలకు పైగా బెల్ట్ షాపులు నిబంధనలకు విరుద్దంగా కోనసాగుతున్నాయి. గ్రామాల్లో చికటి పడగానే ప్రదాన కూడళ్ల వద్ద, ప్రభుత్వ పాఠశాలల మైదానం, రోడ్డుకు గల కల్వర్టులు, ఊరు సమీపంలోని వ్యవసాయ బావుల వద్ద యువకులు గుంపులుగా చేరి మద్యం సేవిస్తుంటారు.
ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ ప్రతి రోజు ఉదయం పాఠశాలకు వచ్చిన పిల్లలకు, ఉపాద్యాయులకు మద్యం సీసాలు దర్శనమిస్తాయి. ఈ విషయం గ్రామాస్తులకు, స్థానిక అధికారులకు, పోలీసులకు పలుమార్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. బెల్ట్ షాపులో మద్యం బాటిల్ పై రూ.20 నుంచి రూ.50 వరకు అధిక ధరలకు విక్రయిస్తుంటారు. అయితే మద్యం దుకాణంలో బెల్ట్ షాపులకు అధిక ధరకు విక్రయిస్తే, వారు ఒక బాటిల్ పై సుమారు రూ.50కి విక్రయిస్తారు.
కేసులు నమోదు చేస్తున్నం శ్రీనివాసమూర్తి, ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి, సిద్దిపేట.
మద్యం వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. గ్రామాల్లో తరుచు దాడులు చేస్తున్నం ఆక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కేసు నమోదు చేస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన వెంటానే స్పందిస్తున్నం. జూన్ లో 18 బెల్ట్ షాపులపై దాడులు చేసి కేసులు నమోదు చేశాము. హుస్నాబాద్, చేర్యాల పరిధిలో సారా తయారీ, విక్రయాలు చేసిన వారిపై సుమారు 10 కేసులు నమోదు చేశాము. గ్రామాల్లో ఆక్రమంగా మద్యం విక్రయిస్తే సమాచారం ఇచ్చిన వివరాలు గొప్యంగా ఉంచుతాము. జిల్లా వ్యాప్తంగా ఆక్రమ మద్యం విక్రయాలకు కట్టడి చేస్తాం.
కలెక్టర్ పట్టించుకోవాలని విజ్ఞప్తి...
సిద్దిపేట జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం విషయాలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రత్యక్షంగా ఫిర్యాదులు చేస్తే తమపై దాడులు చేస్తున్నారని, సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందిస్తే ఫిర్యాదు చేసిన వారి వివరాలు మద్యం వ్యాపారులకు సమాచారం ఇస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖలపై దృష్టి సారించిన కలెక్టర్ గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్న విషయాన్ని పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా యువత విచ్చలవిడిగా మద్యానికి బానిస అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి గ్రామాలలో బెల్ట్ షాపులను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.