విద్యార్థులపై లాఠీచార్జ్ ఆప్రజాస్వామికం
వరంగల్ (మహబూబాబాద్) జులై 23 (విజయక్రాంతి): నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీక్ తర్వాత ఆందోళనతో మరణించిన విద్యార్థులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, భవిష్యత్తులో ఆరోపణలకు తావు లేకుండా పరీక్షలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని, సంసద్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేయటాన్ని ఖండిస్తూ యూనివర్సిటీ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో నిరసన తెలిపారు.
జూలై 20న పార్లమెంటు ముట్టడికి బయలుదేరిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయటం వలన వందలాది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడటమే కాకుండా ఒక విద్యార్థిని మరణించటానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావటం, సీబీఎస్‌ఈ పరీక్షల మూల్యాంకనంలో తప్పులు దొర్లటం, క్యూట్ పరీక్ష నిర్వహణలో లోపాలు తలెత్తడంతో దరిదాపు 55 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందారని, ప్రభుత్వం ఈ వైఫల్యాలకు బాధ్యత వహించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ప్రభుత్వం ఇప్పటివరకు విద్యార్థులకు భరోసా ఇవ్వలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహించి భవిష్యత్తులో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జి చేసి విచక్షణ రహితంగా కొట్టిన పోలీసులపై చర్యలు చేపట్టాలి జరిగిన ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు డాక్టర్ కొంగ వీరస్వామి, డాక్టర్ కనకయ్య, డాక్టర్ శ్రీధర్ కుమార్ లోద్, డాక్టర్ చింతం ప్రవీణ్, డాక్టర్ తిరునహరి శేషు, డాక్టర్ వెన్నంపల్లి విజయకుమార్, డాక్టర్ సునీత, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ భక్కి శ్రీనివాస్, డాక్టర్ జయప్రకాష్, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ రవీందర్, డాక్టర్ హరి శంకర్, డాక్టర్ నవీన్, డాక్టర్ వావిళ్ళ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






