22 June, 2026 | 3:01 AM

అనుమతుల పేరుతో మట్టి అక్రమ రవాణా!

22-06-2026 12:00 AM
  1. ఇటుక బట్టీలకు జోరుగా తరలింపు 
  2. పర్యావరణానికి ముప్పుగా మారుతున్న బట్టీలు
  3. రాజకీయ నాయకుల అండదండలతో మట్టి అక్రమ తవ్వకాలు
  4. రైతుల పేరుతో అనుమతులు
  5. ఇటుక బట్టీలకు మట్టి తరలింపు

సిర్గాపూర్, జూన్ 21: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో అనుమతుల పేరుతో అక్రమ మట్టి రవాణా, ఇటుక బట్టీల నిర్వహణపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగం విస్తరించడంతో ఇటుకల డిమాండ్ పెరిగింది. దీంతో మండలంలోని పలు ప్రాంతాల్లో అనుమతిలేని ఇటుక బట్టీలు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ఇటుక బట్టీలు నిబంధనలు పాటించకుండా నిర్వహించబడుతు న్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇటుకల తయారీ కోసం చెరువులు, కుంటలు, వ్యవసాయ భూముల నుంచి నల్లమట్టిని అక్రమంగా తవ్వి బట్టీలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో భూసారం తగ్గిపోవడంతో పాటు వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. బట్టీల నుంచి వెలువడే పొగ, ధూళి కారణంగా గాలి కాలుష్యం పెరిగి ప్రజలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 

రైతుల పేర అనుమతులు.. ఇటుక బట్టీలకు తరలింపు

రైతుల పేరుతో పంట పొలాలకు అవసరమని అనుమతులు పొందిన కొందరు వ్యక్తులు ఆ మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో కొందరు రాత్రింబవళ్లు చెరువుల నుంచి నల్లమట్టి తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. పర్యావరణ నిపుణులు కూడా ఇటుక బట్టీల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలపై అధికారులు తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అనుమతులు తప్పనిసరి..

ఇటుక బట్టీలకు అవసరమైన అన్ని శాఖల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. చెరువులు, కుంటలు, సొంత పట్టా భూముల్లో మట్టి తవ్వకాల కోసం ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ శాఖల అనుమతులు తీసుకోవాలి. రైతుల పేరుతో అనుమతులు పొంది ఇటుక బట్టీలకు మట్టి తరలించినట్లు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు  చేస్తాం. త్వరలో ప్రత్యేక విచారణ నిర్వహించి అనుమతులు లేని ఇటుక బట్టీలను సీజ్ చేస్తా. 

 కిరణ్ కుమార్, తహసీల్దార్

చర్యలు తీసుకుంటాం..

రైతుల పేరుతో అనుమతులు పొంది ఇటుక బట్టీలకు మట్టి తరలించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.  అనుమతుల్లో పేర్కొన్న ట్రాక్టర్లనే మట్టి రవాణాకు ఉపయోగించాలని, ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి. అనుమతి లేకుండా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో మట్టి తవ్వకాలు జరిపితే కేసులు నమోదు చేస్తాం. 

 మల్లేష్,

ఇరిగేషన్ ఏఈఈ

కేసులు నమోదు చేస్తాం.. 

అనుమతులు లేకుండా చెరువులు, కుంటలు లేదా ఇతర ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు నిర్వహిస్తే సంబంధిత ట్రాక్టర్లు, జేసీబీలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. మట్టి తవ్వకాలు, రవాణా కోసం రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. అక్రమం గా నల్లమట్టి లేదా మొరం రవాణా చేస్తూ పట్టుబడితే వాహనాలను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

 మహేష్, ఎస్సై