ఆర్డీఎస్ ఆయకట్టుకు తూట్లు.. మరో ఉద్యమం తప్పదా?
నాయకులకు, అధికారులకు ఆయకట్టుపై ఎందుకింత నిర్లక్ష్యం
కర్ణాటక సరిహద్దుల్లో పురడి లిఫ్ట్ ఇరిగేషన్ నీటి మళ్లింపు పథకం
అదే జరిగితే ఆర్డీఎస్ మరో ఎండమావి..?
గద్వాల జూన్ 21: రాజోలి బండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) రైతుల పాలిట గుది బండగా మారుతున్నది. దశాబ్దాలుగా నలిగిపోతున్న రైతాంగ వేదనకు, రాజకీయ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు వేలాది ఎకరాలకు సస్యశ్యామలం చేయాల్సిన కాలువలు నేడు నీటి జాడ లేక వెలవెలబోతున్నాయి. ఎగువన అక్రమ కట్టడాలు కర్ణాటక సరిహద్దుల్లో జరుగుతున్న నీటిమల్లింపుతో దిగువన ఉన్న తెలంగాణ చివరి ఆయకట్టు రైతుల హక్కులు కాల రాస్తున్నారు.
ఒప్పందం ప్రకారం అందాల్సిన వాటా నీరు రాక వేలాది ఎకరాలు భూమి ఎడారిగా మారుతుంటే దశాబ్దాలుగా వినిపిస్తున్న ఆధునీకరణ మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయి .సాగునీటి కోసం ఎదురుచూసి అలసిపోయిన రైతులు చివరకు బతుకుదెరువు కోసం కూలీలుగా వలస వెళ్లే దుస్థితి దాపురించింది. గతంలో ఆర్డీఎస్ ఆయకట్టు దగ్గర స్లూయిస్ రంద్రాల మూసివేత విషయంలో తెలంగాణ రైతులు,నాయకులు రాయలసీమ రైతులు, నాయకుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది ఆ ఆ కొట్లాటలో తెలంగాణ రైతులు దెబ్బలు తిన్న విషయం తెలిసిందే.
మళ్లీ అదే పునరావృతం అయ్యేటట్టుగా కనిపిస్తున్నది, ఈసారి కర్ణాటక, తెలంగాణ రైతుల మధ్య గొడవ జరిగే అవకాశం ఉన్నది. ఆయకట్టు దగ్గర కర్ణాటక ప్రభుత్వం నీటి మళ్లింపు పథకం ప్రారంభించిన విషయం ఇక్కడ ఉన్న అధికారులకు నాయకులకు తెలియలేదు అంటే ముక్కున వేలేసుకునే పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వేల ఎకరాల సాగుకు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కీలక ఆధారం. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని తుంగభద్ర నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు అంతరాష్ట్ర నీటిపారుదల వ్యవస్థలో అత్యంత ముఖ్యమైనది.
కర్ణాటకలోని రాయచూర్ హెడ్ వరక్స్ ఉన్నప్పటికీ దీని కింద రాయచూరుతో పాటు తెలంగాణలోని జోగులాంబ గద్వాల ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో లబ్ధి పొందుతున్నాయి .ఈ ప్రాజెక్టు ద్వారా గద్వాల జిల్లాలోని దాదాపు 87500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. వరప్రదాయిని అయిన ఆర్డీఎస్ నేడు ఆధునీకరణ పనులు రిజర్వాయర్ల నిర్మాణంలో జాప్యం కారణంగా ప్రశ్నార్ధకంగా మారింది.
అధికారులు పాలకుల నిర్లక్ష్యం వల్ల లక్షలాది ఎకరాల ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే అప్పటి నిజాం ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది.దీని ప్రకారం ఎడమ కాల ద్వారా తెలంగాణకు 15.9 టీఎంసీల నికర జలాలు దక్కాలి. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని అలంపూర్ ,గద్వాల్ నియోజకవర్గాల్లోని దాదాపు 87500 ఎకరాలకు ముఖ్యంగా అయిజ ,వడ్డేపల్లి, మానపాడు ,ఇటిక్యాల మండలాల్లోని 75 గ్రామాలకు సాగును అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అయితే ఆర్డిఎస్ హెడ్ వర్క్ కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉంది .కాలువ మొదటి 42 కిలోమీటర్లు కర్ణాటక లోనే ప్రవహిస్తుంది.
అక్కడ పై భాగంలో ఉన్న కర్ణాటక రైతులు అక్రమంగా వందలాది హై పవర్ మోటర్లు పెట్టడం, కాల్వకు గండి కొట్టడం వల్ల తెలంగాణ సరిహద్దు దాటే సరికి నీరు సగం అయిపోతుంది, తెలంగాణకు దక్కాల్సిన 15.9 టీఎంసీ లలో కేవలం 5 నుంచి 6:00 టి.ఎం.సి మాత్రమే అందుతున్నాయి. మరోవైపు కర్నూలు జిల్లా కోసం ఏపీ చేపడుతున్న ఆర్డీఎస్ కుడి కాలువ పనులు చట్ట విరుద్ధమని తెలంగాణ వాదిస్తున్నది .ఈ కారణాలవల్ల కాలువ చివరి భాగంలో ఉన్న అల్లంపూర్ ప్రాంత ఆయకట్టు దశాబ్దాలుగా ఎడారిగా మారుతున్నది.
అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టింది .కృష్ణానది బ్యాక్ వాటర్ (సుంకేసుల బ్యారేజ్ ఎగువన) నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఆర్డీఎస్ కాల్వకు మళ్ళించే పనుల్లో తొలి విడత స్టేజ్ 1 పూర్తి చేసి కొంతవరకు ఆ యకట్టుకు తాత్కాలికంగా ఉపశమనం కల్పించింది. గతంలో ఆర్టిఎస్ ఆనకట్ట ఆధునీకరణకు ఆనకట్టపై గండ్లు పడకుండా కాంక్రీట్ కూడా ఎత్తును 15 సెంటీమీటర్లు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం తన వాటా నిధులను కర్ణాటక ప్రభుత్వానికి డిపాజిట్ చేసింది .తెలంగాణ పరిధిలోకి కాల్వ ప్రవేశించిన తర్వాత ఉన్న కాలువలకు కొంతమేర సిల్టు తీసే పనులు ,అంతర్గత లైనింగ్ పనులు పూర్తి చేశారు.
కేవలం నది నుంచి నీటిని నేరుగా లిఫ్ట్ చేస్తే వరద రోజుల్లో మాత్రమే నీరు అందుతుంది. అందుకే ఏడాది పొడవునా నీరూ ఇవ్వడానికి వీలుగా తుమ్మిళ్ల స్టేజ్ 2 లో భాగంగా ప్రతిపాదించిన మూడు రిజర్వాయర్ల నిర్మాణ పనులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది. కర్ణాటక భూభాగంలో ఉన్న మొదటి 42 కిలోమీటర్ల కల్వకు పూర్తిగా కాంక్రీట్ లైనింగ్ జరగాలి. అక్కడ జరుగుతున్న అక్రమ నీటి తోడివేతను అడ్డుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి సంయుక్త రక్షణ , నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఏపీ అక్రమ పనులను అడ్డుకోవడంతోపాటు ఆర్డీఎస్ హెడ్ వరక్స్ నియంత్రణ పూర్తిగా తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.
ఆర్డీఎస్ హెడ్ వరక్స్ దగ్గర ప్రస్తుత పరిస్థితి
ఆర్డీఎస్ ఎగువన 100 మీటర్ల దూరంలో కర్ణాటక ప్రభుత్వం కురిడి లిఫ్టును గత 400 రోజుల నుండి 2 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించే విధంగా ప్రయత్నిస్తున్నది. నిర్మాణం పై ఎలాంటి అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరప కుండానే కురిడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఆర్డీఎస్ ఆయకట్టు అంతంత మాత్రంగానే ఉన్న ఆయకట్టుకు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ విషయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఆయకట్టు నిర్మాణాన్ని ఆపాలని ఆర్డీఎస్ రైతులు కోరుకుంటున్నారు.
నీటిమల్లింపు పథకంపై ఎలాంటి స్పందన లేదు
ఆర్టీఎస్ హెడ్ వరక్స్ దగ్గర కర్ణాటక ప్రభుత్వం కురిడి లిఫ్ట్ ఇరిగేషన్ నీటిమల్లింపు పథకం ప్రారంభించారని ఇట్టి విషయంపై పాలక ప్రతిపక్ష పార్టీలకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేదని వాపోయారు. ఇప్పుడు గనుక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపకపోతే ఆర్డీఎస్ ఆయకట్టు ఉనికికే ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు.
- ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారాంరెడ్డి






