3 July, 2026 | 6:54 PM

ఆగని నీటి దందా

13-05-2026 04:00 PM

స్పందించని ఎమ్మార్వో, విద్యుత్ శాఖ అధికారులు

అధికారుల నిర్లక్ష్యంతో కొనసాగుతున్న నీటి అక్రమ రవాణా

జిన్నారం/అమీన్పూర్: జిన్నారం మండలంలోని కోరుకుంట, కిష్టాయిపల్లి, గడ్డపోతారం, ఖాజిపల్లి, బొల్లారం ప్రాంతాల్లో పరిశ్రమలు, కంపెనీలకు అక్రమంగా నీటి సరఫరా జరుగుతోందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. స్థానిక చెరువులు, బోరుబావుల నుంచి భారీగా నీటిని తోడేస్తూ ట్యాంకర్ల ద్వారా కంపెనీలకు తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ భూముల్లో, వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసిన బోరుబావుల నుంచి 24 గంటల పాటు మోటార్లు నడిపిస్తూ నీటిని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ శాఖ అధికారులు అక్రమ కనెక్షన్లపై దృష్టి సారించకపోవడం, ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఎలాంటి తనిఖీలు లేకపోవడం వల్ల ఈ దందా మరింత విస్తరిస్తోందని స్థానికులు అంటున్నారు.

గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీటి మాఫియా యథేచ్ఛగా వ్యవహరిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎమ్మార్వో స్పందించకపోవడం, విద్యుత్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ నీటి దందాపై సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.