23-10-2024 12:00:00 AM
నాలాను పూడ్చి షెట్టర్ల నిర్మాణం
రాజేంద్రనగర్, అక్టోబర్ 21: అక్రమార్కులు బరితెగించారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ ప్రాంతంలో రత్నదీప్‌కు ఎదురుగా ఉన్న నాలాను పూడ్చి కొందరు సుమారు వెయ్యిగజాల స్థలంలో 12 కమర్షియల్ షెట్టర్లను నిర్మించారు. నాలాను పూడ్చి, సుమారు రెండు నెలలుగా చేవెళ్ల ప్రధాన రహదారిపై కమర్షియల్ నిర్మాణం చేపట్టి పూర్తి చేసినా మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావి స్తోంది.
ఇక్కడ గజం ధర సుమారు రూ.2 లక్షలు పలుకుతుంది.రూ.20 కోట్ల విలువ చేసే ఈ స్థలంలో నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణం చేపట్టినా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అక్రమార్కులు నాలాకు ముందున్న చెట్లను సైతం నరికేశారు.
అక్రమ నిర్మాణ విషయమై గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలిపారు. నాలాను పూడ్చివేసి కట్టిన నిర్మాణాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇదే విషయమై బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ శరత్‌చంద్రను వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్‌లో యత్నించగా ఆయన స్పందించలేదు.