విద్యాదీపాలతో భవిష్యత్తుకు వెలుగు
విద్య అనే దీపం వెలిగితేనే పేదరికం అనే చీకటి తొలగిపోతుంది
జవహర్‌నగర్, జూన్ 18 (విజయక్రాంతి): విద్య అనే దీపం వెలిగితేనే... పేదరికం అనే చీకటి తొలగిపోతుందని టు బిహెచ్ కె జెఎసి అధ్యక్షుడు సందీప్ పేర్కొన్నారు. అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ కాలనీలోని నిరుపేద కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణ డిగ్నిటీ హౌసింగ్ కాలనీస్ టు బిహెచ్కె జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉచిత ప్రవేశాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీకి చెందిన ఐదుగురు విద్యార్థులకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ది సిటీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, గౌతమీ హై స్కూల్లలో ఉచిత ప్రవేశాలు కల్పించారు. కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీత గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రవేశ పత్రాలను అందజేశారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తెలంగాణ టు బిహెచ్కె జేఏసీ అధ్యక్షుడు సందీప్, కార్యదర్శి జంగిలి శివకుమార్, సభ్యుడు రాము తదితరులు మాట్లాడుతూ పేద కుటుంబాల పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, తమ పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే అవకాశం కల్పించిన భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్యా సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, లబ్ధిదారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






