19 June, 2026 | 1:35 AM

ముషీరాబాద్‌లో ప్రతిపాదనలకే పరిమితమవుతున్న అభివృద్ధి పనులు

19-06-2026 12:00 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

బాకారం, జాంభవి నగర్‌లో మంచినీటి పైప్‌లైన్ పనులు ప్రారంభం

ముషీరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ముషీరాబాద్‌లో అభివృద్ధి పనులు ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆరోపించారు. గురువారం ముషీరాబాద్‌లోని జాంభవి నగర్ లో రూ.1.89 లక్షలతో మంచినీటి పైపైన నిర్మాణ పనులు, బాకారంలో రూ. 1.43లక్షలతో మంచినీటి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి డీజీఎం విష్ణువర్ధన్, సెక్షన్ మేనేజర్ శివసాయిలతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  అభివృద్ధి పనుల నిమిత్తం ప్రతిపాధనలు రూపొందిస్తే నెలలు గడుస్తున్నా వాటికి నిధులు కేటాయించకుండా వెనకకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే నిధులు లేవు, తాము ఏమీ చేయలేమని నిర్లక్ష్యధోరణితో సమాధానం ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల పలు అభివృద్ధి పనులు పెండింగ్లో ఉంటున్నాయని, ప్రజలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొం దని పేర్కొన్నారు.

నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మంచినీరు, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ముఠా జై సింహ, రెబ్బ రామారావు, మీడియా ఇన్ఛార్జి  ముచ్చకుర్తి ప్రభాకర్, ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు టి. సోమన్, శివ ముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, తలారి శ్రీకాంత్ ముదిరాజ్, జార్జ్, పూస గోరఖ్ నాథ్, కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్, బాపూజీనగర్ డివిజన్ల అధ్యక్షులు లింగాల శ్రీకాంత్ గౌడ్, నరేందర్ బాబు, నగర కార్యదర్శులు గోవింద్, జయకుమార్, భోలక్ పూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు బిజ్జి కనకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.