అమలే అసలు పరీక్ష
విద్యావ్యవస్థలో లోపాలు, ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు వంటి వ్యవస్థాగత సమస్యల పరిష్కారం దిశగా కీలకమైన ముందడుగు పడింది. పరీక్ష పేపర్ లీకులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టరూపం దాల్చనున్న ఈ బిల్లులో పేపర్ లీకులకు పాల్పడేవారికి కఠినమైన శిక్షలు పడేలా నిబంధనలను రూపొందించడం ముదావహం.
ప్రశ్నాపత్రాలను లీక్ చేసేవారికి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలకు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానాలు వంటి అంశాలతో ఈ చట్టానికి ఉన్న కోరలు మరింత పదునెక్కాయి. పరీక్షల నిర్వహణ సంస్థలపై కూడా భారీ జరిమానాలు, నిర్వహణ బాధ్యతలపై నిషేధం వంటి చర్యలు, వేగవంతమైన దర్యాప్తు కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి నిర్ణయాలను తాజా సవరణల్లో చేర్చడం శుభపరిణామం.
తాజా సవరణల ద్వారా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే వారి ఆటకట్టించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ చట్టానికి కఠినమైన తాజా సవరణలు తీసుకురావడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జెన్ జీ యువత దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నెల రోజుల పాటు తీవ్రస్థాయిలో నిరసనలు చేశారు. పార్లమెంట్‌ను ముట్టడించారు. ఈ క్రమంలో భద్రతా బలగాల చేతుల్లో లాఠీ దెబ్బలను కాచుకున్నారు.
మరోవైపు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ అధికారిక నివాసం ముందు నిరసన చేపట్టాల్సి వచ్చింది. ఇటు యువత, అటు విపక్షాలు, మేధావులు, సామాజికవేత్తల నుంచి వచ్చిన ఒత్తిడి తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి యాంటీ పేపర్ లీక్ బిల్లును తీసుకొచ్చింది. ఇది యువత పోరాట ఫలితమే కావచ్చు కానీ, దీనినే అంతిమ విజయంగా భావించడం మాత్రం పొరపాటే అవుతుంది.
మన దేశంలో చట్టాలకు కొదవ లేదు. అవినీతిని నిరోధించేందుకు, అక్రమాలను అరికట్టేందుకు, పారదర్శకతను పెంచేందుకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. అయినప్పటికీ చట్టాల ఉద్దేశం, వాటి అమలు మధ్య అంతరం కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు విద్యావ్యవస్థపై మళ్లీ భరోసా కలిగించాలంటే దాని అమలు కూడా అంతే కఠినంగా, నిష్పక్షపాతంగా ఉండాలి.






