1 August, 2026 | 1:36 AM

మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల దందా

01-08-2026 12:35 AM

ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

ముగ్గురు నిందితుల అరెస్ట్

రూ. 4 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

ఖైరతాబాద్, జూలై 31 (విజయక్రాంతి): అక్రమంగా జరుగుతున్న నిషేధిత మెఫెంటెర్మైన్ సల్ఫేట్ దందాను హైదరాబాద్ సిటీ పోలీసులు బట్టబయలు చేశారు. ఇంజెక్షన్లను నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను చార్మినార్ జోన్ టా స్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదాబాబు వెల్లడించారు.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ పాత బస్తీలోని టప్పాచబుత్రా నటరాజ్ నగర్ కు చెందిన షేక్ ఫహీమ్ (31),మోహమ్మద్ నయీం (35), ఇబ్రహీం హుస్సేన్ (22) ఒక ముఠాగా ఏర్పడ్డారన్నారు. వారు మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్పీ పెట్రోల్ పంప్ గల్లీలో ఉన్న శ్రీ మారుతి లాజిస్టిక్స్ వద్ద టాస్క్ ఫోర్స్, సైఫాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.

వారి వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన 100 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వైయల్స్, ఒక యమహా ఏరాక్స్ స్కూటీ, 3 మొబైల్ ఫోన్లు కలిపి మొత్తం రూ.4 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు.నిందితులు ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన శక్తి హుడా అనే వ్యక్తి నుంచి ట్రాన్స్ పోర్ట్ ద్వారా ఇంజెక్షన్లను తెప్పించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం సైఫాబాద్ పోలీసులకు కేసును అప్పగించినట్లు వెల్లడించారు.

అయితే మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ను వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడితే కార్డియాక్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. మత్తు కోసం యువత ఇటువంటి ప్రమాదకర, నిషేధిత డ్రగ్స్ వాడొద్దని సూచించారు. ఈ ఆపరేషనులో చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐలు మధు, రామారావు, మహేశ్, కానిస్టేబుల్ సంతోష్ కుమార్, టాస్క్ ఫోర్స్ బృందం, సైఫాబాద్ పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.