3 June, 2026 | 1:47 AM

ఇందిరమ్మ బీమా పథకం అమలు

03-06-2026 12:24 AM

విద్య, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం పెద్ద పీట 

రైతులు సన్న వడ్లు సాగు చేయాలి

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభించి ప్రతి కుటుంబానికి అండగా ఉండేలా కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం సిద్ధిపేట కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రూ.2 లక్షల పెన్షన్లు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు విద్య సంవత్సరం, వ్యవసాయ సాగు ప్రారంభం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో విద్యా, వ్యవసాయ రంగాలకు పెద్ద పీట వేస్తుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకు, కవులు, కళాకారులు, గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చేలా కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్ లో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించుకోవడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కేసులు, దాడులు, నష్టపోయిన వారిని గౌరవించి, గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మొదటి దశలో ఒక్కో నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడం జరిగిందన్నారు. రెండవ దశలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సీఎం  ఆసిఫాబాద్ లో ప్రారంభించారనీ చెప్పారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ అధికారులు రైతులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

జిల్లాలో సంవత్సరానికి లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం కానీ ఇక్కడ 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందనీ, రైతులు మనకు అవసరమైన సన్న బియ్యం పండించేలా విత్తనాల నటేటప్పటి  నుండే అవగాహన కల్పిస్తామన్నారు. సన్న వడ్లు సాగు చేయాలన్నారు. ప్రతి రైతు ఆయిల్ ఫామ్ సాగు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం,  మన దగ్గర నర్మేట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభమైందనీ గుర్తు చేశారు. ప్రతి ఉద్యోగి, జర్నలిస్టు ఏకకాలంలో మొక్కలు నాటేలా గ్రామగ్రామ నా ప్రణాళికలు రూపొందిస్తున్నాట్లు చెప్పారు. 3 లక్షల ఈత చెట్లు సిద్ధంగా ఉన్నాయనీ, కాలువల గట్లు, ప్రభుత్వ స్థలాల్లో నాటడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపడుతున్నాం, ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు ఉంటాయో అక్కడ పాడైపోయిన వాహనాలు ఏర్పాటు చేస్తాం, అవసరమైతే గతంలో ప్రమాదాల్లో మరణించిన వారి ఫోటోలు కూడా పెట్టీ అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీనీ ఆపరేషనల్ లాస్ నుండి లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారనీ, 35 లక్షల కిలోమీటర్లు బస్సులు ప్రయాణం చేస్తున్నాయనీ వివరించారు. ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని, త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయనీ వివరించారు. అంతకు ముందు రాష్ట్ర అవతరణ వేడుకలలో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు.