పరిశుభ్రతకు ప్రాధాన్యత
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి:
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): గ్రామాల పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు, పచ్చదనం పెంపుతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఊర్కొండ మండలంలోని ఉరుకొండపేట, ముచ్చర్లపల్లి గ్రామాలను సందర్శించి, కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణాల నాణ్యత, పురోగతిపై సమీక్షిస్తూ, లబ్ధిదారులు పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఇళ్ల బిల్లులను దశల వారీగా ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఇళ్లు పూర్తి చేసిన వారు త్వరగా గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, చెత్త నిర్వహణ, డ్రైనేజీ, తాగునీటి వసతులపై శ్రద్ధ వహించాలని తెలిపారు.
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ముచ్చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆయన, గ్రామస్తులు తెలిపిన సమస్యలపై వెంటనే స్పందించి, మౌలిక సదుపాయాల లోపాలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఉరుకొండపేటలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న కలెక్టర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జనార్దన్ రెడ్డి, పిడి హౌసింగ్ సంగప్ప, తాహసిల్దార్ యూసుఫ్ అలీ, ఎంపీడీవోతో పాటు ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






