5 May, 2026 | 12:41 PM

కట్టుకున్నోడే కడతేర్చాడు

10-12-2024 01:54 AM

* 24 గంటల్లో హత్యకేసు ఛేదించిన పోలీసులు

* నిందితుడి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

నిజామాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): బాల్కొండ మండలం వంనెల్ బి గ్రామంలో హత్యకు గురైన శివకళ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. కేసు వివరాలను బాల్కోండ రూరల్  సీఐ శ్రీధర్‌రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. నాందేడ్ జిల్లాకు చెందిన జెంగరాజు గంగారం, శివకళ దంపతులు బతుకుదెరువు కోసం గతేడాది వన్నెల్ బిగ్రామానికి వచ్చారు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవారు. కొంతకాలంగా మద్యానికి బానిసైన గంగారం తరచూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు.

శనివారం రాత్రి ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది. ఈక్రమంలో గంగారం గొడ్డలితో శివకళ తలపై దాడి చేసి తలుపునకు బయటి నుంచి గడియ పెట్టి పరారయ్యాడు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్యచేసినట్టు అంగీకరించాడు. కాగా నింది తుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు సీఐ తెలిపారు.