03-05-2025 12:50:02 AM
ఇటు టాలీవుడ్ వారికైనా, అటు బాలీవుడ్ వారికైనా ఐటం సాంగ్ అనగానే ఈమధ్య గుర్తుకొస్తున్న పేరు తమన్నా భాటియా. ప్రత్యేక గీతాల్లో తన అందచందాలతో అంతలా యువతను ఉర్రూతలూగించిందీ మిల్కీ బ్యూటీ. అలాంటిది ఆమె ఇటీవల ‘ఓదెల2’ చిత్రంలో సాధువుగా అలరించింది. ఇప్పుడు ఓ మైథలాజికల్ మూవీలో భాగమైంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా అరుణభ్ కుమార్, దీపక్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం ‘వీ వన్: ఫోర్స్ ది ఫారెస్ట్’. దీన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చ ర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ఈ మైథలాజికల్ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషిస్తున్నట్టు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ప్రీ టీజర్‌ను సైతం విడుదల చేసింది. రాత్రి వేళ ఎర్రటి చీర ధరించిన తమన్నా కారు దిగి అడవిలోకి వెళ్లి, అక్కడ ఓ దీపం వెలిగించడం, అక్కడేదో దృశ్యాన్ని చూసి కళ్లు పెద్దవి చేయడం వంటి సన్నివేశాలు ఈ వీడియోలో కనిపించాయి.
మరోవైపు తమన్నా సైతం ఈ ప్రాజెక్టును ఉద్దేశించి సోషల్‌మీడియా వేదికగా స్పందించింది. “అడవి పిలిచింది.. నేను సమాధానం చెప్పాను. ‘వీ వన్’లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉంది” అని ఆమె పేర్కొంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.