calender_icon.png 22 November, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి

22-11-2025 03:19:20 PM

- విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి

- ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

- బోయినపల్లి కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ

బోయినపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ను ఇంచార్జి కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. విద్యార్థులు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని వివరించారు.

ఈ సందర్భంగా విద్యాలయంలో 6వ, 9వ తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధపెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

పీహెచ్సీ తనిఖీ

బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు, ఓపీ, మందుల రిజిస్టర్, వ్యాక్సిన్ గది, మందులు ఇచ్చే గదిని పరిశీలించారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై రోగుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు.

గర్భిణీలు అందరూ ప్రభుత్వ దవాఖానల్లో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలని, ఇక్కడ అందుతున్న సేవలు, వసతులపై క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని, నిరంతరం పరీక్షలు చేసి వైద్యం అందించాలని సూచించారు. సర్కార్ దవాఖానల్లోనే ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో బీమా జయ శీల ఉన్నారు.