22-11-2025 03:22:13 PM
అదిలాబాద్ ఎంపీ గొడం నగేష్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో ఆసిఫాబాద్ ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన మండలంలోని పివిటిజి లబ్ధిదారులకు పీఎం జన్మన్ కింద నిర్వహించిన ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ పీఎం జన్మన్ ద్వారా ప్రతి పేద గిరిజనులకి ఇండ్లు అందించడమే లక్ష్యమన్నారు. ప్రస్తుత విడతలు ఇండ్లు రాని వారికి కూడా భవిష్యత్తులో అందించడం జరుగుతుందన్నారు. పివిటిజిల అభివృద్ధి కోసం వారి వారి గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటికే మల్టీపర్పస్ సెంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు వీటిలో అంగన్వాడి, హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హాల్, లైబ్రరీ లాంటి సేవలన్నీ ఒకే చోట లభిస్తున్నాయన్నారు. పేద గిరిజనులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ జిల్లాలో 2169 ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. వీటిలో అత్యధికంగా ఆసిఫాబాద్, తిర్యానీ మండలాల్లో మంజూరైనట్లు వివరించారు. ఇండ్ల నిర్మాణాలలో ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వాలు అందిస్తున్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవలక్ష్మి మాట్లాడుతూ మండలంలో 543 ప్రతిపాదనలు పంపించామని 449 మంజూరయ్యాయని మిగతావి కూడా మంజూరు చేయించడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఇండ్ల నిర్మాణాలలో దళారులను నమ్మి మోసపోకూడదని ఎవరికి వారుగా ఇండ్లు నిర్మించుకోవాలన్నారు. అప్పుడే వాటి నాణ్యత ప్రమాణాలు బాగుంటాయని సూచించారు.