calender_icon.png 22 November, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 29న 'దీక్షా దివస్'.. దిశానిర్దేశం చేసిన కేటీఆర్

22-11-2025 02:27:48 PM

హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి నవంబర్ 29న తెలంగాణ అంతటా ‘దీక్షా దివస్’ను(Deeksha Diwas) ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటంలో భాగంగా 15 సంవత్సరాల క్రితం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ దీనిని ఒక గొప్ప కార్యక్రమంగా నిర్వహించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పార్టీ శ్రేణులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఆయన శనివారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ జనరల్ బాడీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, దీక్షా దివస్ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శనం చేశారు. దీక్షా దివస్ నిర్వహణకు ముందుగా, ఈ నెల 26వ తేదీన అన్ని జిల్లాల పార్టీ కేంద్రాల్లో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవాలని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) సూచించారు. ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సహా ఇతర కీలక నాయకులందరినీ ఆహ్వానించాలని కేటీఆర్ ఆదేశించారు. 

ఈ సన్నాహక సమావేశాల ముఖ్య ఉద్దేశం, నవంబర్ 29న పార్టీ ఘనంగా నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఒక రోజు ముందుగా, అంటే 28వ తేదీ సాయంత్రంలోగా జిల్లా కేంద్రాలు, పట్టణాలను బ్యానర్లు, ఫ్లెక్సీలతో అలంకరణ, పార్టీ కార్యాలయం ప్రాంగణాన్ని కూడా సుందరంగా అలంకరించాలని కేటీఆర్ సూచించారు. జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకంగా సమాచారం అందించి, కనీసం 1000 మంది కీలక పార్టీ నేతలతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 

మొదటగా తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత, కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా కెసిఆర్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేయాలన్నారు. దీక్షా దివస్ సందర్భంగా జరిగిన అనేక కీలక సంఘటనలు, వార్తలు, పరిణామాల సమాహారంతో కూడిన ఫోటో ప్రదర్శనను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఫోటోలను పార్టీ కేంద్ర కార్యాలయం జిల్లాకు పంపిస్తుంది. వీటితో పాటు, స్థానిక జిల్లాల్లో దీక్షా దివస్ సందర్భంగా జరిగిన సంఘటనల ఫోటోలు, వార్తా కవరేజ్ క్లిప్పింగ్‌లతో మరొక ఉప విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చని కేటీఆర్ వివరించారు.

కేవలం రాజకీయ ఉపన్యాసాలు కాకుండా, ఆనాటి ఉద్యమ స్మృతులను, ముఖ్యంగా దీక్షా దివస్ వివరాలను అందించేలా మాట్లాడే వక్తలను ఆహ్వానించాలని, వారి సమయాన్ని ఇప్పుడే నిర్ధారించుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. దీక్షా దివస్ రోజున పండ్ల పంపిణీ, వీలుంటే అన్నదానం లాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టవచ్చన్నవారు. హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో ప్రత్యేకంగా పండ్ల పంపిణీ చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అలాగే, పార్టీ యూత్, విద్యార్థి విభాగం తరఫున ప్రతి యూనివర్సిటీలో దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా వారు దీక్షా దివస్ పేరుతో, కేసీఆర్ చిత్రంతో కూడిన ప్రత్యేక టీ-షర్టులను ధరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.