22-11-2025 02:52:21 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): మహిళల గౌరవం, ఆర్థిక అభివృద్ధికే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. శనివారం పెద్దకొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు వంటి పథకాలు అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మహిళలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు వ్యాపారాల్లో రాణించాలని సూచించారు. మండలానికి చెందిన 67 మంది లబ్ధిదారులకు ₹1,16,000 విలువైన కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులు, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.