తెలంగాణలో విద్య హక్కు కాదు.. పక్కా దోపిడీ!
టీ చిరంజీవులు :
విద్య ఒక రాజ్యాంగబద్ధ హక్కు. అది కొందరికే అందుబాటులో ఉండే విలాస వస్తువు కాదు. ఫీజుల నియంత్రణ లేకుండా విద్యారంగాన్ని పూర్తిగా మార్కెట్ శక్తుల చేతుల్లో వదిలేస్తే మధ్యతరగతి, పేద కుటుంబాలపై భారం మరింత పెరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు. అది కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవం, చాలామంది అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న చారిత్రక స్వప్నం. ఉద్యమ సమయంలో సామాజిక తెలంగాణ నిర్మిస్తామని, ప్రతి పేద కుటుంబానికి విద్య, ఉద్యో గం, గౌరవప్రదమైన జీవనం అందిస్తామని హామీలు ఇచ్చారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనే నినాదం కూడా ప్రజలలో అపారమైన ఆశలు నింపింది.
కానీ, తెలంగాణ ఏర్పడిన పన్నెండేళ్ల తర్వాత వాస్తవ ప రిస్థితిని పరిశీలిస్తే, ప్రజలు కలగన్న సామాజిక తెలంగాణ స్థానంలో ప్రైవేటీకరణ ఆధా రిత తెలంగాణ రూపుదిద్దుకుందని చెప్పక త ప్పదు. ముఖ్యంగా విద్యారంగంలో ప్రైవే టు సంస్థల ఆధిపత్యం పెరుగుతోంది. ఫలితంగా విద్య ఒక హక్కు కాకుండా, కొను గోలు చేయాల్సిన వస్తువుగా మారిపోయింది. తెలంగాణలో యూడైస్ 2014-15 గణాంకాల ప్రకారం మొత్తం 43,839 పాఠశాలలు ఉండగా, వాటిలో 28,822 ప్రభుత్వ పాఠశాలలు (65.74%) ఉన్నాయి.
ప్రైవేటు పాఠశాలలు 14,438 (32.93%) ఉన్నాయి. అయితే 2026 నాటికి ప్రభుత్వ పాఠశాలల వాటా 60.89 శాతానికి పడిపోగా, ప్రభుత్వ విద్యావ్యవస్థపై ప్రజల నమ్మకమూ గణనీయంగా తగ్గింది. ఇంకా ఆందోళనకరమైన విషయం విద్యార్థుల సంఖ్యలో వచ్చిన మార్పు. 2014--15 లో 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతు న్న విద్యార్థుల్లో 46.49 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 28 శాతానికి పడిపోయింది.
ప్రభుత్వాలు రెసిడెన్షియల్ పాఠశాలల విస్తరణను తమ విజయంగా చెబుతున్నాయి. నిజమే, రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్య 296 నుంచి 1,004కి పెరిగాయి. విద్యార్థుల సం ఖ్య కూడా 1.4 లక్షల నుంచి 5.5 లక్షలకు చేరింది. కానీ, రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ఇది పరిమిత వర్గాని కే ప్రయోజనం కలిగించింది. మిగతా లక్షలాది మంది విద్యార్థులు మాత్రం అధిక ఫీజులు, ప్రైవేటు విద్యా వ్యాపారం భారం మోస్తూనే ఉన్నారు.
తెలంగాణలో ఫీజు నియంత్రణ రెగ్యులేషన్ చట్టం ఎందుకు లేదు? ప్రైవేట్ పాఠశా లలు, జూనియర్ కళాశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించే సమర్థవంతమైన చట్టం ఎం దుకు లేదు? ఈ దోపిడీపై సమాధానం చె ప్పాల్సింది ఎవరు? సంయుక్త ఆంధ్రప్రదేశ్ లోనే విద్యావ్యవస్థను నియంత్రించడానికి 27-1-1982 నుంచి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్, 1982 అమల్లో ఉంది. ఈ చట్టం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల రిజిస్ట్రేషన్, గు ర్తింపు, నిర్వహణ వంటి అంశాలను నియంత్రించే ప్రయత్నం జరిగింది.
అనంతరం 1983లో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ (రెగ్యులే షన్ ఆఫ్ అడ్మిషన్స్ అం డ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ) చట్టం, 1983 తీసుకువచ్చి క్యాపిటేషన్ ఫీజులను నియంత్రించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత 1994లో వచ్చిన జి.ఓ. నెం.1 ద్వారా ప్రైవేట్ పాఠశాలల గవర్నింగ్ బాడీలకు వారి ఖర్చుల ఆధారంగా ఫీజులు నిర్ణయించుకునే అధికారం కల్పించారు. అయితే 1990వ దశకంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల సంఖ్య విపరీతంగా పెరగ డంతో, ఫీజుల విషయంలో ఎటువంటి నియంత్రణ లేని పరిస్థితిగా మారింది.
దీనిని అదుపులో పెట్టేందుకు ప్రభుత్వం 06 08-2009న జి.ఓ. 91ను తీసుకువచ్చి జి ల్లా స్థాయిలో జిల్లా ఫీజు నియంత్రణ కమిటీ (డీఎఫ్‌ఆర్సీ)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలలు వసూలు చేయదల చిన ఫీజులను ఈ కమిటీల ఆమోదంతోనే అమలు చేయాలనే నిబంధనను ప్రవేశపెట్టింది. అయితే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కోర్టులను ఆశ్రయించాయి. కోర్టులు ఫీజు నియంత్రణ అవసరాన్ని గుర్తించినప్పటికీ, జీవోలోని కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
కానీ, ఆ లోపాలను సరిదిద్ది కొత్త విధానాన్ని తీసుకురావాల్సిన ప్రభుత్వం ఆ ప్రక్రియను ముం దుకు తీసుకెళ్లలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. 2017లో ప్రభుత్వం తిరుపతిరావు కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా జిల్లా ఫీ రెగ్యులేషన్ కమిటీల ఏర్పా టు, ప్రతి సంవత్సరం గరిష్టంగా 10 శాతం వరకు మాత్రమే ఫీజు పెంపునకు అనుమతి వంటి కీలక సిఫారసులు చేసింది.
కానీ, ఆ నివేదిక అమలుకు నోచుకోలేదు. 2018లో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ నివేదిక వెలుగులోకి రాలే దు. రాష్ట్ర విద్యా కమిషన్ కూడా ఫీ రెగ్యులేషన్‌పై 2025 మార్చిలో నివేదిక సమర్పించింది. అనంతరం మరోసారి ప్రభుత్వం కేశవరావు అధ్వ ర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పటికీ సమగ్ర ఫీ రెగ్యులేషన్ చట్టం మాత్రం అమలులోకి రాలేదు.
ఇక్కడ కొన్ని మౌలిక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మూడు దశాబ్దాలుగా ఫీజుల నియంత్రణపై చర్చ జరుగుతున్నా, చట్టం ఎందుకు రావడం లేదు? ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తిడి ప్రభుత్వాలపై అంత ప్రభావం చూపుతోందా? ఫీజు నియంత్రణ కోరడం అంటే ప్రైవేట్ విద్యను వ్యతిరేకించడం కాదు కదా? నాణ్యమైన విద్య అందరి కీ అందుబాటులో ఉండాలంటే పారదర్శకమైన ఫీజు విధానం అవసరం లేదా? ప్రతి సంవత్సరం లక్షలాది కుటుంబాలు విద్య కోసం అప్పుల పాలవుతున్న పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోదా? ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రైవేట్ విద్యాసంస్థల పాత్రను ఎవరూ ఖండించడం లేదు. కానీ, విద్య ఒక సేవనా? లేక పూర్తిగా లాభాపేక్షతో నడిచే వ్యాపారమా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
స్వతంత్ర భారతదేశంలో విద్యారంగంలో తీసుకువచ్చిన అత్యంత ముఖ్యమైన చట్టాలలో విద్యాహక్కు చట్టం ఒకటి. ఈ చట్టం ప్రధాన లక్ష్యం సామాజిక, ఆర్థిక అసమానతలను అధిగమించి ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను అందించడం. పేదవాడి పిల్లవాడైనా, ప్రధాని పిల్లవాడైనా ఒకే తరగతి గదిలో పక్కపక్కనే కూర్చొని చదువుకోవాలనే సమానత్వ భావనతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంలోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రవేశ స్థాయి తరగతుల్లో 25 శాతం సీట్లను బడుగు ,బలహీనవర్గాల పిల్లలకు కేటాయించాలి.
దీని వల్ల అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. దేశంలోని 22 రాష్ట్రా లు ఈ నిబంధనను అమలు చేస్తున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ఎందుకు అమలుకావడం లేదు. 2023 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే తమ పార్టీ కేంద్రంలో తీసుకువచ్చిన చట్టంలోని అత్యంత కీలకమైన నిబంధన అయిన 25 శాతం సీట్ల కేటాయింపును ఇప్పటికీ అమలు చేయకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టం తెలంగాణలో ఎందుకు అమలుకావడం లేదు? పేద పిల్లలకు నాణ్యమైన ప్రైవేట్ విద్యను అందించే అవకాశాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారు? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. లక్షలాది మంది పేద విద్యార్థులు చట్టబద్ధంగా పొందాల్సిన అవకాశాన్ని, సుమారు 10 లక్షల సీట్లను కోల్పోతున్నారు.
ఇది విద్యా విధానానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు; సామాజిక న్యా యం, సమాన అవకాశాలు, రాజ్యాంగ హామీలకు సంబంధించిన అంశం కూడా. పేదలకు చట్టం ద్వారా కల్పించిన హక్కులనూ అమలు చేయపోతే, తెలంగాణ ఆవి ర్భావం ద్వారా సామాన్య ప్రజలు ఆశించిన సామాజిక న్యాయం ఎంతవరకు సాధ్యమైందనే ప్రశ్న ముందుకు వస్తుంది.
విద్యపై అత్యంత తక్కువ పెట్టుబడి పెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇప్పటికే తెలంగాణ అక్షరాస్యతలో దేశంలో దిగువ నుంచి 3వ స్థానంల్లో ఉంది. విద్యా నాణ్యతపరంగా కూడా అనేక సవాళ్లను ఎదుర్కొం టోంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన ప్రభుత్వం నీటిపారుదల, విద్యుత్, రవాణా వంటి రంగాలపై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ విద్యను మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది.
2026-27 తెలంగాణ బడ్జెట్‌ను పరిశీలిస్తే, మొత్తం రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ లో విద్యకు రూ.26,674 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే బడ్జెట్‌లో 8.2 శాతం మాత్రమే విద్యకు వెళ్తోంది. కానీ, వాస్తవాలను దేశంలో అత్యంత పేద రాష్ట్రంగా భా వించే బీహార్ తన బడ్జెట్‌లో 19.63% (రూ.68,217 కోట్లు) విద్యకు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.34,875 కోట్లు, అంటే సుమారు 11.7 శాతం విద్యకు కేటాయించింది.
కర్ణాటక 10.7% (రూ.47,936 కోట్లు), మహారాష్ట్ర 13.1% (రూ.1,08,467 కోట్లు), మధ్యప్రదేశ్ 13.7% (రూ.60,049 కోట్లు), ఢిల్లీ 18.64% (రూ.19,326 కోట్లు) విద్యకు కేటాయిస్తున్నాయి. దేశ సగటు విద్యా వ్యయం 14-15 శాతం మధ్యలో ఉం ది. మరి పాలకులు ఎందుకు విద్యకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదు? విద్యలో పెట్టుబడి పెరిగితే బహుజన వర్గాలు విద్యావం తులై, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయం గా ఎదిగి రాజ్యాధికారం లాక్కుంటారనే భ యమా? ఒకవైపు తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వాలు చెబుతూ, మరోవైపు విద్యకు కేవలం 8.2 శాతం బడ్జెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసం? విద్యపై పెట్టుబడి లేకుండా అభివృద్ధి సాధ్యమా? అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
విద్య ప్రైవేటీకరణ వేగవంతం: తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యారంగంలో అ త్యంత వేగంగా జరిగిన మార్పు ప్రైవేటీకరణ. 2018లో తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీల చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చి ఎనిమిదేళ్లు కూడా పూర్తికాకముందే రాష్ట్రంలో సుమారు 20 ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. మరోవైపు ప్రభుత్వరంగంలో ఇప్పటివరకు ఉన్న యూనివర్సిటీల సంఖ్య 19 మాత్రమే.
అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటం టే, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలలో ఉద్యోగ నియామకాల్లో సామాజిక న్యాయం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు కావ డం లేదు. తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగిందని చెప్తూ, వేలాది ఉద్యోగ అవకాశాలను రిజర్వేషన్ల పరిధి బయటకు నెట్టివేయడం ఎంతవరకు సమంజసం? ఇంకోవైపు ప్రభుత్వ యూనివర్సిటీలలో అధ్యా పక నియామకాలు జరగలేదు.
అనేక యూనివర్సిటీలు అడ్‌హాక్, కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బందితోనే నడుస్తున్నాయి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేకుండా ప్రపంచ స్థాయి విద్య ఎలా అందుతుంది? వైద్య విద్యలో కూడా ప్రైవేటీకరణ వేగం గా పెరుగుతోంది. ప్రభుత్వరంగంలో 35 మెడికల్ కళాశాలలు ఉన్నప్పటికీ, ప్రైవేట్ రంగంలో 19 కళాశాలలు ఉన్నాయి. మొత్తం సుమారు 8,415 మెడికల్ సీట్లలో దాదాపు 4,200 సీట్లు ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి.
ఇంజినీరింగ్ విద్యలోనూ మెజారిటీ సీట్లు ప్రైవేట్ కళాశాలల ఆధీనంలోనే ఉన్నాయి. తెలంగాణలో విద్య ఒక హక్కుగా కాకుండా వ్యాపారంగా మారిపోయింది. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వర కు లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఈ మొత్తం భారం చివరకు తల్లిదండ్రులపైనే పడుతోంది.
ప్రజల డిమాండ్లు ఇలా:
1. విద్యకు బడ్జెట్ కేటాయింపులను 15 శాతానికి పెంచాలి. ప్రభుత్వ పాఠశాలలు, క ళాశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూ ళ్ల పేరుతో కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కో సం రూ.200కోట్లు ఖర్చుపెట్టడం సరికాదు.
2. ఫీజు రెగ్యులేషన్ చట్టాన్ని వెంటనే తీసుకురావాలి.
3. విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1)(సి) ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లను పేద పిల్లలకు అమలు చేయా లి.
4. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అన్ని బోధన, బోధనేతర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
5. ప్రైవేట్ విద్యాసంస్థల్లో సామాజిక న్యాయం, పారదర్శకతను నిర్ధారించే విధానాలు రూపొందించాలి.
విద్యపై ఖర్చు వృథా కాదు, అది సమాజ భవిష్యత్తుపై పెట్టుబడి. విద్యావంతమైన సమాజమే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడుతుంది. కానీ, విద్యను వ్యాపారంగా మార్చి, ప్రభుత్వ బాధ్యతలను ప్రైవేట్ రంగానికి అప్పగిస్తే అసమానతలు మరింత పెరుగుతాయి. అందుకే తెలంగాణ ప్రజలు విద్యను ఒక హక్కుగా తిరిగి స్థాపించుకోవాలి.
నీట్ పేపర్ లీకేజీ వంటి సమస్యలపై కాక్రోచ్ జనతా పార్టీ, జెన్ జీ యువత ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నా విజయవంతం కావడం స్వాగతించదగ్గ విషయం. విద్య దోపిడీపై జెన్ జీ స్పందించాలి. ప్రజల ఒత్తిడి ద్వారానే విద్యా విధానాల్లో మార్పు సాధ్యమవుతుంది. విద్యను కాపాడటం అంటే తెలంగాణ భవిష్యత్తును కాపాడటమే.
వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్,
బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్






