28-07-2025 12:00:00 AM
‘ముందు మీరు రాయడం ప్రారంభించండి. అది ఏదై నా సరే. ఒక్క సారి అక్షర కుళాయి తెరుచుకుందా.. ఇక ఆ ధార ఆగదు’ అంటారు ఓ రచయిత. ఆ వాక్యాలను తన ‘అంతరంగం’ తొవ్వలోకి తీసుకొని గత, ప్రస్తుత సమాజ వర్తమాన జీవన చిత్రానికి తన అక్షరాలతో ప్రాణం పోసి, ఆలోచనల అంతరిక్షంలో నవ సమాజాన్ని నిలిపినాడు అన్నవరం దేవేంద ర్.
కాలమ్ రాయడమంటే కదులుతున్న కాలంతో ప్రయాణిస్తూనే, ప్రకాశిస్తూనే, రాబోయే కాలానికి ముందు మాటలు రాస్తూ ప్రవహించడం. సమ సమాజ నిర్మాణంలో రేపటి తరానికి ఆశయాల కలల రెక్క లు తొడగడం. 360 డిగ్రీల పరిధిలో సత్యా న్ని శోధిస్తూనే, శాస్త్రీయ దృక్పథాన్ని బోధించడం. ప్రపంచీకరణ, మానవ సంబంధాలు, సాంకేతికత, సంస్కృతి, సంప్రదాయాలు, ఉద్యమాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞా నం, రాజకీయాలు, సాహిత్యం, వైద్యం, ఆర్థికం, విశ్వశాంతి.. ఇలాంటి ఎన్నో అంశాలపై లోతై న అధ్యయనం, అన్వేషణ ఉంటూనే తెలంగాణ పదజాలాన్ని ఒడిసిపట్టి,
పాఠకులకు ఆసక్తిగా సూటిగా అర్థమయ్యే విధంగా దేవేందర్ కాలమ్స్ రాశారు. దాదాపు మూడున్న ర సంవత్సరాలుగా ‘దిశ’ దినపత్రికలో అనం త విషయాల అంతరంగపు పోకడలను తన అంతరంగంగా ఆవిష్కరించారు. దిశ డిజిటల్ మీడియాలో ప్రతివారం ‘దిక్సూచి’గా పాఠకులకు కనిపించారు. తనదైన శైలితో వ్యాసాల పరంపరకే వన్నె తెచ్చారు.
కొవిడ్ సంక్షోభావిష్కరణ..
కొవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది. మనుషులకు బతుకు విలువతో పాటు ఆరోగ్య ప్రాముఖ్యతను, శ్మశానపు తాత్వికతను తెలియజేస్తూనే, ఉరుకుల పరుగుల సంపాదన జీవితాన్ని కాసేపు పక్కనపెట్టి జీవన గమనాన్ని ప్రేమించాలనే సందేశం వినిపించింది. మనమంతా ఒక్కటేనని, కుల, మత, ప్రాంత సరిహద్దులను చెరిపేస్తూ, తోటి వారికి సాయపడాలనే మానవ త్వపు విలువలను ప్రబోధించింది.
అందుకే ఆస్పత్రుల్లో బెడ్లకు లైన్లు, ఏడ్వడానికి కూడా తావులేని బీభత్సకర వాతావరణ మార్పులు, శ్మశానంలో శవాలకి క్యూలైన్లు.. అంటూ అన్నవరం కొవిడ్ ప్రభంజనానికి అక్షర రూపం ఇచ్చారు. రేపటికి మన శ్వాస ఆడుతుందా? నేడే ఆగిపోతుందా? అన్న మీమాం సలో ఉన్న నాటి ప్రపంచానికి కామెంట్రీగా దేవేందర్ మిగిలాడు. ‘సచ్చిన పిల్లిని గోడవతల ఇసిరేసినట్టు’వంటి జన నానుడి వాక్యాల తో, కరోనాతో కకావికలం వంటి వ్యాఖ్యలతో మనుషుల హృదయాలను ద్రవింపజేశారు.
ప్రస్తుతం మానవుడి అరచేతిలో మొబైల్ ఫోన్ దేహంలో భాగం. అది ఆన్‌లైన్, ఆఫ్ లైన్ అనుభవాలతో నేడు మనకు హస్తభూష ణం అయింది. ఇక సోషల్ మీడియా మానవ నాగరికత సంస్కృతీ సంప్రదాయాలపై చెరగని ముద్ర వేస్తున్న తీరును రచయిత తన కాలమ్స్‌లో వివరించిన విధానం ఆకట్టుకుంటుంది. కాలంతో పాటు వచ్చిన డిజిటలైజే షన్ లోని మార్పులకు అనుగుణంగా ఈదూ బుక్స్, ఈదూ పేపర్స్ రాకతో పుస్తక పఠనం ఎందాక వచ్చిందో.. ఏ తీరాన్ని తాకుతుందో.. కొంత ఆందోళనతోనే నిజాయితీగా దేవేందర్ తన కాలమ్స్ సంకలనమైన ‘అంతరంగం’లో వివరించారు.
కొత్త సంస్కృతులు విస్తృతమవుతున్న ఈ తరుణంలో యువతరానికి సోయి ఉండాలంటారు దేవేందర్. అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాల వల్ల నేడు “రాజకీ యం” మొత్తం వ్యాపారమైందని ఆవేదన చెందుతూనే, నిజమైన ప్రజా ప్రాతినిధ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి దేవేందర్ పలు వ్యాసాల్లో వివరించారు. మారుతున్న స్వరాల జీవిత సరిగమల మధురిమలను తెలియజేస్తూనే, ఆనంద జీవనాన్ని ఆస్వాదించమంటారు.
అనివార్యతను స్వాగతించడం నేర్చుకుంటేనే పది కాలాల పాటు మానవ మనుగడ కొనసాగుతుందని, అన్నివేళలా బతుకు సమరంలో మన అంతరాత్మ ను శోధించుకుంటూ, అడుగులు కదపాలనే సూచనలిస్తారు. ‘మీరు పుస్తకాలు కొంటున్నా రా’ అని మనల్ని ప్రశ్నిస్తూనే ఒక పుస్తకం గురించి, మరొక పుస్తకం ఏం మాట్లాడుతుం దో అని చమత్కారంగా మనకు వివరిస్తారు.
దాదాపు 30 పుస్తకాల ఆలోచన తాలూకు అక్షరాలకు తన సమీక్షతో ప్రాణ ప్రతిష్ఠ చేశా రు. తన కలంతో ‘కవి కులం’ గురించి విశ్వ మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు. పండు వెన్నెలలో కవిత్వ ప్రవాహపు వెన్నెల అలజడి తరంగాలను పాఠకుల హృదయాల్లో కనిపించేలా పుస్తకాన్ని ముద్రించారు. అనంత కాల గమనం గురించి తెలంగాణ ఉద్యమ జ్వాలల వెలుగులో గమనం పుస్తకాన్ని చూపించారు.
సాంకేతికత మార్పులపై..
పర్యావరణం పట్ల కొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ఉన్న చైతన్యాన్ని మనకు పాఠాలుగా చెప్పారు దేవేందర్. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ, పేపర్ కప్పులు, పేపర్ బ్యాగులు వాడాలని, క్లాత్ బ్యానర్ల ప్రాధాన్యం గురించి సూచించారు. ఓ వ్యాసం లో ‘అసలే తెలుగు వాళ్లం. కొని చదవం’ అనే అపవాదు ఉండగా ఉన్నది. మలయాళం, తమిళం తదితర రాష్ట్రాల కవుల పుస్తకాలు వేలకు వేలు అచ్చువేస్తే రెండు నెలల్లోనే అమ్ముడవుతాయి.
మన దగ్గర మాత్రం ఇంటి నిండా బీరువాల్లో వుంచుకొని పంచడం ఎందుకు? ఇది పీడీఎఫ్‌లో యుగం అంటూ మనల్ని ఆలోచనల సాగరంలో నిర్దాక్షిణ్యంగా ముంచేస్తారు. నేటి మనిషి చదువు, మార్కు లు, మెరిట్, ఉద్యోగాల ప్యాకేజీలు అన్ని దశల్లోనూ గడియారం ముల్లుతోనే పోటీపడు తూ, నిద్రలేని రాత్రులు గడుపుతూ, మానసి క ఒత్తిడితోనే ప్రశాంతత పరిమళాన్ని అనుభవించలేకపోతున్నాడంటారు దేవేందర్.
దూర దృష్టి, దృఢసంకల్పంతో పరిపక్వత కలిగిన, మానసిక సంబంధాలను నెలకొల్పాలని ఆయన ఆశిస్తున్నారు. ఇంటర్నెట్ యుగంలో కూడా నగరాల్లో పుస్తక మహోత్సవాలు విరివిగా జరగడం మంచి సంప్రదాయం అంటు న్నారు. చరిత్ర వర్తమాన సామాజిక ఆర్థిక సాంస్కృతిక విషయాల పట్ల వికాసాన్నిచ్చేవి కేవలం పుస్తకాలు మాత్రమేనని రూఢీగా చెప్తున్నారు.
కాబట్టి అందరూ అధ్యయనం చేసే పుస్తకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం నేటి తరానికి ముఖ్యమైన అవసరమంటున్నారు. ప్రాథమిక పాఠశాల లో నేర్చుకున్న పాఠాలు అక్షరాలు వ్యాకరణాలు గుణింతాలు, శాస్త్రాలు ఇవన్నీ విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయంటున్నారు. మా బడి వజ్రోత్సవం లో 75 వసంతాల జ్ఞాపకాల తడి లోకి స్ఫూర్తివంతంగా తీసుకెళ్తారు దేవేందర్.
నేడు మనందరి గురువు యూట్యూబ్ అంటూ రకరకాల వెజ్, నాన్ వెజ్ రుచులతో పాటు సామాజిక ప్రయోజనం కోసం టెక్నాలజీ అందరి సొత్తు అంటారు. ల్యాండ్ ఫోన్లు వాడుతున్న సందర్భంలో కనీసం 20 నుంచి 30 నంబర్లు జ్ఞాపకం ఉండేవని, ఇప్పుడు మాత్రం కూడికలు, తీసివేతలకు కూడా క్యాలిక్యులేటర్లు వాడుతున్నారని చమత్కరిస్తారు.
కొన్ని జీవితాల్లో వసంతం రాదని బతుకులెప్పుడు రాలుతూనే ఉంటాయని పేద ప్రజల జీవితాల గురించి రక్తచలన సంగీతాన్ని అక్షరీకరించారు. నేటి సమాజంలో హింస వివిధ రూపాల్లో పెరిగిపోతూ మనిషిలో క్రూరత్వం మితిమీరిపోతుందని హెచ్చరించారు. మనుషుల్ని చంపడానికి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయ డం, చట్టాలు న్యాయాల పట్ల భయం లేకపోవడం, అసలు సమాజం ఎటు పోతుందని సూటిగా మనల్ని ప్రశ్నిస్తారు.
ఉద్యమాల పలవరింత..
తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలే ఒక పులకరింపు. ఒక పలవరింతలా ఉంది. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటానికి సాక్ష్యమై నిలబడ్డాం. 1,200 మంది అమరవీరుల రక్తతర్పణంతో త్యాగబలంతో తెలంగాణ ఆవిర్భవించింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ భాష అధికార భాషగా అమలు కాలేదు. నియామకాల విషయంలో నిరుద్యోగులు దశాబ్దానికి పైగా అసంతృప్తిగా ఉంటూ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు.
వ్యవసాయ రంగం విజయం సాధించినప్పటికీ రైతుల పేరుతో భూ యజమానులు లబ్ధి పొందుతున్నారు. ఏదేమైనా స్వతంత్ర తెలంగాణలో ప్రజాస్వామ్య దృక్పథం, స్వేచ్ఛ కొన సాగాలి. ఈ నేల మీద విజయవంతంగా సాగి న గొప్ప శాంతియుత ప్రజా ఉద్యమం తెలంగాణ. జయహో తెలంగాణ అంటూ ఆకాశం అదిరేలా నినదించారు అన్నవరం. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రచనతో సమాజంలోకి అక్షర తేజస్సును ప్రసరింపజేస్తున్నారు.
తనకు తానే ఒక తొవ్వ వేసుకొని సంచారం చేస్తూనే ఊరి దస్తూరిని చిత్రించి, కాలం వెంట పరుగులు తీస్తూనే, నిత్యం నవ యువకుడిగా వుంటూనే జీవన తాత్పర్యం చెబుతు న్నారు. 12 కవితా సంపుటాలతో పాటు, పదు ల సంఖ్యలో ప్రతిష్ఠాత్మక పురస్కారాల వంటివెన్నో దేవేందర్ జీవన హరివిల్లుకు అందాన్ని చ్చాయి. ఆశయాన్ని నేర్పాయి.
ఆయన వ్యక్తిత్వ వికాసపు శోభను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఈ నెల 22న నిర్వ హించిన మహాకవి దాశరథి శతజయంతి ఉత్సవాల్లో దేవేందర్‌కు దాశరథి పురస్కారా న్ని ప్రదానం చేసింది. దేవేందర్ మున్ముందు ప్రజల వైపు నిలుస్తూ, తన వాదనను వినిపి స్తూ, యువతరానికి ప్రేరణనిచ్చేలా రచనలు సాగాలని, ఆయన ప్రతిభా శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తూ..