04-08-2025 09:11:07 AM
హైదరాబాద్: యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్(Universal Creation Fertility Center) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐవీఎఫ్ చికిత్స కు వచ్చిన వారిని సరోగసి పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు(Gopalapuram Police) నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. తమకు అందించిన మెడికల్ రిపోర్టులు తీసుకొచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. నల్గొండకు చెందిన దంపతుల నుంచి డాక్టర్ నమ్రత రూ. 44 లక్షలు కాజేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితుల ఫిర్యాదుతో నమ్రత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ కు చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. కళ్యాణి గ్యాంగ్ కొన్ని రోజుల తర్వాత విశాఖ పిలిచి స్పెర్మ్ తీసుకుని పంపినట్లు తెలుస్తోంది. సరోగసి పేరుతో రూ. 18 లక్షలు తీసుకుని మోసం చేశారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. నమ్రత, డా. విద్యులత, కల్యాణి, శేషగిరి, శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎన్ఆర్ఐలను కూడా నమ్రత గ్యాంగ్ మోసం చేసినట్లు ఫిర్యాదు అందుతున్నాయి. బాధితుల నుంచి నమ్రత రూ. 25 లక్షలు కాజేసింది. బాధితుడి ఫిర్యాదుతో నమ్రతపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన బాధితుల నుంచి నమ్రత గ్యాంగ్ రూ. 50 లక్షలు కాజేసింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు.