04-08-2025 09:43:42 AM
హైదరాబాద్: ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Congress MLA Komatireddy Rajagopal Reddy) కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూచించారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందని తెలిపారు. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా జర్నలిస్టులను(Social Media Journalists) దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని ఆయన హెచ్చరించారు. రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించిన వ్యాఖ్యాలపై రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) స్పందిస్తూ... కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని ఎక్స్ లో పేర్కొన్నారు.
నవ తెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మరోసారి యూట్యూబ్ జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి నోరుపారేసుకున్నారు. యూట్యూబ్ జర్నలిస్టులను చూస్తే చెంప పగలగొట్టాలని అనిపిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టు ముసుగులో రాజకీయ పార్టీల కోసం ముందుకొస్తున్న వారిపట్ల సమాజం నిశితంగా గమనించాలన్నారు. అలాంటి వారు వేరన్న విషయాన్ని అసలు సిసలైన జర్నలిస్టులు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
నిబద్ధత కలిగిన జర్నలిస్టులు ఈ వింత పోకడలపై సదస్సులు నిర్వహించి నిజమైన జర్నలిస్టులు ఎవరన్నది నిర్వచనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనల పట్ల ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్టు కూడా అదే దారిలో వేగంగా పరుగెత్తుతున్నారని పేర్కొన్నారు. నిజమైన జర్నలిస్టులకు, ఆ ముసుగులో వస్తున్న వారికి మధ్య ఒక లక్ష్మణ రేఖను గీయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆ పని జరక్కపోతే పత్రికలకే కాదు, దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల ముసుగు తొడుక్కుని విద్రోహ చర్యలకు పాల్పడిన సంగతి ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కొందరిని అరెస్టు చేసిన ఘటనల్లో వెలుగులోకి వచ్చాయని తెలిపారు.