calender_icon.png 4 August, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక పర్యాటక వ్యాప్తికి కృషి

29-07-2025 12:00:00 AM

కళలు, ఆధ్యాత్మికత, చారిత్రక వారసత్వానికి ప్రతీక తెలంగాణ. ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు. ప్రతి ఊరి గడప గడపకూ చరిత్ర ఉంది. ఇక్కడి జానపద గీతాల్లోని సొగసు దేశంలా మరెక్కడా ఉండదంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రపంచంలో పూలను దేవుళ్లుగా భావించి బతుకమ్మ ఆడే ప్రకృతి పండుగ ఒక్క తెలంగాణలోనే ఉంది. ఇక్కడి సంస్కృతికి చారిత్రకత వెన్నెముక.

కోటి లింగాల శివాలయం నుంచి కాకతీయుల గడ్డ వరకూ, గోల్కొండ ఖిల్కొండ నుంచి వేయి స్తంభాల గుడి వరకూ  ప్రతి శిల్పం, ప్రతి కట్టడానికి ఒక చరిత్ర ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా రూపుదిద్దుకున్నాక ఈ వారసత్వాన్ని పునఃస్థాపించే కృషి ప్రారంభమైంది. బతుకమ్మ పండుగ మాత్రమే కాదు, చెరువుల సంస్కృతి కూడా మానవ జీవనానికి ఆధారం అయింది. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు నేటికీ వ్యవసాయానికి నడుంగతలై నిలుస్తున్నాయి.

ఈ ప్రాంతంలో సాహిత్య, నాటక రంగాలు, జానపద కళలు అనాది సమృద్ధిగా వృద్ధి చెందాయి. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీ నిజాంలు పాలించిన ఈ ప్రాంతం సకల కళలకు ఆలవాలంగా ఉండేది. నేలకొండపల్లి, ధూళికట్ట, ఫణిగిరి బౌద్ధరామాలు, స్థూపాలు, శాసనాలు, మెదక్ కేథడ్రల్, సికింద్రాబాద్‌లోని ఆల్ సెయింట్స్ చర్చి, హైదరాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ కేథడ్రల్ చర్చి, ఇస్లామిక్ ఆధ్యాత్మిక ప్రదేశాలు, మక్కా మసీదు.. ఇలా లెక్కలేనన్ని చారిత్రక కట్టడాలు చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్నాయి.

ఆ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు, రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను ఎలుగెత్తి చాటేందుకు ‘రాష్ట్ర సాంస్కృతిక సారథి’ ఏర్పడింది. సంస్థ రాష్ట్రప్రభుత్వం యవజన సేవలు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు అనుబంధంగా పనిచేస్తున్నది. దీనిలో భాగంగానే సంస్థ ఇప్పటికే 550 మందికి పైగా కళాకారులను ఒకచోట చేర్చింది. వారికి నిరంతరం జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నది.

కళాకారులు నిత్యం ప్రజల మధ్యకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. సామాజిక దురాచారాలు, మూఢనమ్మకాలను పారద్రోలేందుకు ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ప్రజాప్రయోజన అంశాలను ఊరూరా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంస్థకు నన్ను చైర్మన్‌ను చేసి, గతేడాది సంస్థకు క్యాబినెట్ హోదా కల్పించింది. సంస్థ ఒక్క ప్రచార కార్యక్రమాలే కాకుండా డప్పు, డోలక్ వాద్యకారులు, ఒగ్గు కథలు, కర్రసాము, కోలాటం, వీధి నాటకాల్లో కళాకారులకు శిక్షణ ఇస్తున్నది.

శిక్షణా శిబిరాలు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నది. కళాకారులు ఇప్పటికే రామప్ప ఆలయం నుంచి హైదరాబాద్‌లోని చార్మినార్ వరకు ఎన్నో చారిత్రక కట్టడాల విశేషాలను ప్రపంచానికి చాటిచెప్పారు. బతుకమ్మ, బోనాల పండుగల విశిష్టతను చాటుతున్నారు. పేరిణి శివతాండవం, ఒగ్గు కథ వంటి కళారూపాలను ముందు తరాలకు తీసుకెళ్లేందుకు మేం ప్రణాళికలు రచిస్తున్నాం.

ఔత్సాహికులైన కళాకారులను చేరదీసి వారిని శక్తిమంతమైన కళాకారులుగా తయారు చేస్తున్నాం. పర్యటక రంగ అభివృద్ధిలోనూ సంస్థ కృషి చేస్తున్నది. ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఊరూరా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. ప్రజలకు మన ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, మంచి చెడు చెప్పేందుకు వినోదాన్ని మేళవించి కొత్త కళారూపాలను ప్రోత్సహిస్తున్నాం. 

 డా.గుమ్మడి వెన్నెల గద్దర్,

రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్