కొట్లాడి సాధించిన తెలంగాణలో.. కంపుతో జనజీవనం అస్తవ్యస్తం
- డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని.. పాదయాత్రలతో ప్రజాచైతన్యం
- పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య
జవహర్‌నగర్, జూలై 12 (విజయక్రాంతి): కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో డంపింగ్ యార్డ్ ప్రాంతాల ప్రజలు కంపు భరించలేక జనజీవనం హస్తవ్యస్తమవుతుందని గాలి నీరు నేల పూర్తిగా విష తుల్యమవుతున్నా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం డంపింగ్ పై నోరు మెదప పోవడం సిగ్గుచేటని పిఓడబ్ల్యు జాతీయ నాయకురాలు సంధ్య దుయ్యబట్టారు. డంపింగ్ యార్డ్ వ్యతిరేక సాధన కమిటీ పిలుపులో భాగంగా న్యూ డెమోక్రసీ నాయకురాలు పోరాట కమిటీ కో- కన్వీనర్ అనురాధ ఆధ్వర్యంలో ఆదివారం జవహర్ నగర్ లోని గిరిప్రసాద్ నగర్ లో పాదయాత్రల తో ప్రజా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంధ్య హాజరై మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ప్రాంతాల్లోని 100 బస్తీల ప్రజల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించి డంపింగ్ యార్డ్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలతో కాలనీలో ఇంటింటికి తిరుగుతూ డంపింగ్ భూతంపై ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ఈనెల 26న శాస్త్రవేత్తలతో జరిగే భారీ ప్రజా అవగాహన సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్షావలి, లలిత యాదవ్, అంబికా, స్వరూప, సరిత జ్యోతి, మీరా, అరుణక్క, శ్రీదేవి, సావిత్రి, సుబ్రహ్మణ్యం పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






