27 March, 2026 | 2:22 AM

వనపర్తిలో చిన్నారిపై అనుచిత ప్రవర్తన

27-03-2026 12:35 AM
  1. వార్డెన్ అరెస్ట్, పోక్సో కేసు నమోదు
  2. పోలీస్ స్టేషన్ ఎదుట పలు పార్టీల నాయకుల ధర్నా 

వనపర్తి, మార్చి 26 (విజయక్రాంతి) : వనపర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో మూడవ తరగతి చదువుకున్న చిన్నారిపై అనుచిత ప్రవర్తనకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని వనపర్తి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అభి అనే వ్యక్తి స్థానిక ప్రైవేట్ పాఠశాలలో వార్డెన్‌గా పనిచేస్తున్నాడు. అదే స్కూల్‌లో చదువుతున్న మూడే ళ్ల చిన్నారిపై అతడు అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయాన్ని చిన్నారి తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు వెంటనే వనపర్తి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిని జూనియర్ సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

పీఎస్ ఎదుట పార్టీల నేతల ధర్నా

కాగా పాఠశాలలో జరిగిన సంఘటన గురించి ప్రశ్నించడానికి వెళ్ళిన నాయకులు నందిమల్ల అశోక్, చీర్ల చందర్,మెకానిక్ శ్రీనుతో పాటు మరో 6మందిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు గురువారం బీఆర్‌ఎస్,బీజేపీ, పలు పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు.అక్రమంగా అరెస్టు చేసిన నాయకుల్ని విడుదల చేయాలని,బాధిత బాలికకు, కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ప్రశ్నించిన వారిపైన పోలీసులు అక్రమ అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డీ  నాయకులను కలిసి పోలీసుల తీరుపై నిరసనను వ్యక్తం చేశారు. అరెస్ట్ అయిన తొమ్మిది మంది నాయకుల్లో ఒకరికి పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేయ గా మిగిలిన వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు నాయకులు వెల్లడించారు.

ధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజశేఖర్ గౌడ్, పెద్దిరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు మురళి సాగర్ శ్రీకర్ గౌడ్ చింటూ, బీఆర్‌ఎస్ నాయకులు కాగితాల లక్ష్మీనారాయణ, ఉంగ్లం తిరుమల్, సమద్ స్టార్ రహీం, హేమంత్ ముదిరాజ్, జోహార్ హుస్సేన్, సూర్యవంశం గిరి, యుగంధర్ రెడ్డి, చిట్యాల రాము, సీపీఎం నాయకులు పరమేశ్వరా చారి, సీపీఐ నాయకులు గోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.