23 July, 2026 | 10:42 AM

ఆమ్‌దానీ మస్తుగుండాలె!

29-06-2024 02:45 AM
  • మంత్రుల స్థాయి, ఎమ్మెల్యేల స్థాయిలో సిఫారస్‌లు

పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ సబ్ డివిజన్లకు భలే డిమాండ్

సంగారెడ్డి, జూన్ 28 (విజయక్రాంతి): శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది పోలీస్ అధికారులకు తాము విధులు నిర్వరిస్తున్న స్థానం నుంచి స్థానచలనం కలిగింది. సబ్ డివిజన్ స్థాయిలో ఎస్సైలు బదిలీ కాగా, జిల్లాల స్థాయిలో సీఐలు బదిలీ అయ్యారు. విజయవంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల కోడ్ ముగిసింది.

దీంతో సంగారెడ్డి జిల్లా పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సీఐలు, ఎస్సైలు తమకు నచ్చిన పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయించుకునేందుకు పైరవీలు ప్రారంభించారు. వేతనం విషయాన్ని పక్కన పెడితే సైడ్ ఇన్ కం వచ్చే పోలీస్‌స్టేషనను ఎంచుకుని అక్కడికి బదిలీ చేయించుకునేందుకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్ సబ్ డివిజన్లలో పోస్టులకు క్రేజీ పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.  

‘లా అండ్ ఆర్డర్’కు వచ్చేందుకు..

జిల్లాలో పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ పోలీసు సబ్ డివిజన్లు ఉండగా, నారాయణఖేడ్ డివిజన్‌లో పోస్టింగ్స్‌కు పెద్దగా డిమాండ్ లేదని సమాచారం. పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ సబ్‌డివి జన్లపైనే ఎక్కువ మం ది ఎస్సైలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఎస్సైలతో పాటు సీఐలూ సైతం తమకు అనుకూలంగా ఉండే సర్కిళ్లకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వికా రాబాద్ జిల్లా నుంచి కొందరు ఎస్సైలు సంగారెడ్డి జిల్లాకు వచ్చేందుకు  ఆసక్తి కనబరుస్తున్నట్లు భోగట్టా. కొందరైతే ఏకంగా మంత్రుల ద్వారా జిల్లా పోలీస్ బాస్‌లకు కాల్ చేయిస్తున్నారని, మరికొందరు ఏకంగా రాష్ట్ర పోలీస్ బాస్‌పైనే ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఏసీబీ, సీఐడీ, ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబీలకు వెళ్లిన వారు తిరిగి లా అండ్ ఆర్డర్‌కు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 

హైవే పక్కన పీఎస్‌లపై ఆసక్తి..

పటాన్ చెరు సబ్ డివిజన్‌లోని నేషనల్ హైవేకు 65 పక్కన ఉండే పటాన్‌చెరు, భానుర్, ఐడీయా బొల్లారం, అమీన్‌పూర్, జిన్నారం, గుమ్మడిదల, హత్నూర పోలీసు స్టేషన్లలో ఎక్కువ మంది బదిలీ కోరుతున్నట్లు తెలిసింది. సంగారెడ్డి డివిజన్‌లో సంగారెడ్డి రూరల్, కొండాపూర్, సదాశివపేట, మునిపల్లి జోగిపేట పోలీస్‌స్టేషన్లు, జహీరాబాద్ డివిజన్‌లో జహీరాబాద్ టౌన్, కోహీర్, హద్నూర్, చిరాగ్‌పల్లి, ఝరాసంగం పోలీస్‌స్టేషన్లు, నారాయణఖేడ్ డివిజన్‌లోని నారాయణఖేడ్ టౌన్, కంగ్టి, నాగిలిగిద్ద, కల్హేరా పోలీసు స్టేషన్లపై కొందరు ఆసక్తి చూపిస్తున్నారు.