ఇక బల్దియా ఆస్తుల డిజిటలైజేషన్ !
- మేల్కొలిపిన మియాపూర్ హెచ్‌ఎండీఏ భూ ఆక్రమణ ఉదంతం
- ‘జీహెచ్‌ఎంసీ’ సైతం అప్రమత్తం
- ఓపెన్ ల్యాండ్స్, భవనాలు, లీజ్‌స్థలాల అన్యాక్రాంతం కాకుండా సమగ్ర చర్యలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): మియాపూర్‌లోని హెచ్‌ఎండీఏ స్థలంలో కొందరు గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నాలను అధికారులు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఆ ప్రాంతంలో వందల ఎకరాలను భూముల పరిరక్షణకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భూములను ఆక్రమించేందుకు యత్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇదే బాటలో జీహెచ్‌ఎంసీ కూడా పయనిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో గ్రేటర్ పరిధిలోని బల్దియా ఆస్తుల పరిరక్షణకు సమగ్ర చర్యలు చేపడుతున్నది. దీనిలో భాగంగానే ఇటీవల నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎస్టేట్ విభాగం అధికారులతో ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. బల్దియా ఆస్తుల రికార్డులను డిజిటలైజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కేటగిరీల వారీగా ఆస్తులు...
ఆస్తుల ద్వారా ఆదాయ వనరులను పెంచుకునేందుకు ప్రణాళికలను రూపొందించనున్నారు. ముఖ్యంగా ఓపెన్ స్థలాలు, లీజు స్థలాల వివరాలను కేటగిరీల వారీగా విభజించి జాబితాను సిద్ధం చేయనున్నారు. లీజు స్థలాల్లో ఆస్తుల ద్వారా నెలవారీగా వచ్చే అద్దెలు, ఆదాయ వివరాలతో పాటు అన్ని రకాల ఆస్తులు పరాయిపాలు కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్థలాలకు సంబంధించిన లీజ్ పీరియడ్ ముగుస్తుందని ముందే ఆన్‌లైన్‌లో తెలుసుకునేందుకు ప్రత్యేక సాంకేతికతను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
జీహెచ్‌ఎంసీలో కమ్యూనిటీ హాల్స్‌ను దేని కోసం వినియోగిస్తున్నారు. మోడల్ మార్కెట్లు, మున్సిపల్ మార్కెట్ల పరిధిలో ఎన్ని గదులున్నాయి.. అనే వివరాలను సమగ్రమైన వివరాలను అధికారులు సిద్ధం చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ ఆస్తుల రికార్డులు పక్కాగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. నగర మేయర్ మరోసారి సమీక్ష నిర్వహించే నాటికి ఆస్తులతో పాటు లీజ్ స్థ లాల వివరాలతో కూడిన జాబితాను సి ద్ధం చేయనున్నారు. నివేదికను మ రో సారి సమీక్షా సమావేశం లో మేయర్‌కు అందించనున్నారు.






