5 August, 2026 | 2:41 AM

అసంపూర్తి సర్వీస్ రోడ్లను వెంటనే పూర్తి చేయాలి

05-08-2026 01:32 AM

ఎంపీ కడియం కావ్య 

జనగామ, ఆగస్టు 4 (విజయక్రాంతి): యాదాద్రివరంగల్ మధ్య జాతీయ రహదారి-163 పై అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్‌ఏఐ) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించి సమస్యను వివరించారు.

ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ.. హైదరాబాద్‌భూపాలపట్నం జాతీయ రహదారి (ఎన్హెచ్-163)లోని యాదాద్రివరంగల్ నాలుగు లేన్ల విస్తరణ పనుల సమయంలో నిడిగొండ, రఘునాథపల్లి, చాగల్, స్టేషన్ ఘన్పూర్, చిన్నపెండ్యాల, కరుణాపురం గ్రామాల పరిధిలో సర్వీస్ రోడ్లు నిర్మించినప్పటికీ, వాటి మధ్య పలు ప్రాంతాల్లో అనుసంధాన లింకులు మిగిలిపోయాయని తెలిపారు. జనగాం సమీపంలోని.

87/200 కి.మీ నుంచి నిడిగొండ వరకు, నిడిగొండ నుంచి రఘునాథపల్లి వరకు, రఘునాథపల్లి నుంచి చాగల్ వరకు, చాగల్ నుంచి స్టేషన్ ఘన్పూర్  వరకు, స్టేషన్ ఘన్పూర్ నుంచి చిన్నపెండ్యాల వరకు, చిన్నపెండ్యాల నుంచి కరుణాపురం వరకు ఉన్న సర్వీస్ రోడ్లలో లింకులు లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వివరించారు.దీని పై సానుకూలంగా స్పందించిన చైర్మన్ సంబంధిత అధికారులతో సమీక్షించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.