11 May, 2026 | 1:12 AM

వంగిన రేలింగ్.. పొంచి ఉన్న ముప్పు

11-05-2026 12:11 AM

- చారకొండ బైపాస్‌పై అసంపూర్తి పనులు

- పట్టించుకోని కాంట్రాక్టర్, అధికారులు

చారకొండ, మే 10: కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చారకొండ మండల కేంద్రంలో నిర్మించిన బైపాస్ రోడ్డు వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. రహదారి నిర్మాణంలో కాంట్రాక్టర్లు వదిలేసిన అసంపూర్తి పనులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. చెరుకుపల్లి చౌరస్తా సమీపంలో బైపాస్ రహదారి పక్కన రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప రేలింగ్లు ఊడిపోయి, ప్రమాదకరంగా రోడ్డుపైకి వంగి ఉన్నాయి. బైపాస్ రోడ్డు కావడంతో వాహనాలు ఇక్కడ మితిమీరిన వేగంతో దూసుకువస్తుంటాయి.

ఈ క్రమంలో రోడ్డును ఆక్రమించేలా వంగి ఉన్న ఇనుప రేలింగ్లు వాహనాలకు తగిలేలా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ఈ రేలింగ్లు సరిగ్గా కనిపించకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.

ఇక్కడ కనీసం హెచ్చరిక బోర్డులు గానీ, రేడియం సూచికలు గానీ ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. బైపాస్ పనులు పూర్తయి చాలా కాలమైనా, పెండింగ్ పనులను పూర్తి చేయడంలో కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. జాతీయ రహదారుల అధికారులు సైతం ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యవేక్షించకపోవడం గమనార్హం. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం వాటిల్లకముందే అధికారులు స్పందించి, తక్షణమే వంగిన రేలింగ్ను సరిచేయాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని స్థానిక ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.