9 May, 2026 | 4:59 AM

మితిమీరిన జోక్యంతో సింగరేణిని ధ్వంసం చేశారు

23-06-2024 12:48 AM

2014లో సింగరేణి ఖాతాలో రూ.3500 కోట్ల డిపాజిట్లుండేవి

కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్‌ఎస్ దోపిడీపై విచారణ చేయాలి

కేంద్రం పారదర్శకంగా బొగ్గు గనుల వేలం వేస్తోంది

ఇప్పటివరకు 9 రౌండ్లలో 107 బొగ్గు గనుల వేలం

తెలంగాణలో కొత్త బొగ్గు గనుల అన్వేషణ సాగిస్తాం

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): మితిమీరిన జోక్యంతో కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిని అప్పుల పాలు చేసిందని, సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్‌ఎస్ పార్టీయేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి విషయంలో కేసీఆర్, ఆయన కుటుంబం తమ రాజకీయ జోక్యంతో దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారని, లోపభూయిష్టమైన విధానాలతో సింగరేణిని నిర్వీర్యం చేశారని విమర్శించారు.

రాష్ర్టం ఏర్పడినప్పుడు 2014 ఏప్రిల్ 1 నాటికి సింగరేణి సంస్థ ఖాతాలో రూ.3500 కోట్ల డిపాజిట్లు ఉండేవని, 2014కు ముందు సింగరేణి తన మిగులు నగదు బ్యాలెన్సులను డిపాజిట్ చేసేందుకు.. అధిక వడ్డీ చెల్లించేవారికే బహి రంగంగా ఆహ్వానించి, బ్యాంకులను డామినేట్ చేసిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. సింగరేణి సంస్థ 2014కు ముందు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేదని,  ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అస్త వ్యస్థ పరిపాలన, మితిమీరిన జోక్యంతో సింగరేణిని అప్పులపాలు చేసిందన్నారు.

సింగరేణి ఆర్థిక పరిస్థితిని అధ్వానంగా చేసి కార్మికులను కష్టాలకు గురిచేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కారు సరిగ్గా చెల్లింపులు చేయకపోవడంతో మార్చి 31 నాటికి టీఎస్ జెన్‌కో సింగరేణికి రూ.8056 కోట్లు బకాయి పడిందన్నారు. బొగ్గు, విద్యుత్‌కు సంబంధించి సుమారు రూ. 30 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలు, ట్రాన్స్‌కో, జెన్‌కోకు చెల్లించినట్లయితే నేడు విద్యుత్ సంస్థల పరిస్థితి మెరుగ్గా ఉండేదని, సింగరేణి సంస్థ కూడా సకాలంలో బిల్లులు చెల్లించే అవకాశం ఏర్పడేదన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసంబద్ధమైన విధానాలతో సింగరేణి సంస్థలో కార్మికులకు సకాలంలో బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. 

చక్కగా ఉన్న సింగరేణిని నాశనం చేశారు

గతంలో చక్కగా ఉన్న సింగరేణి... కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ సర్పంచ్ నుంచి మొదలు ఎమ్మెల్యే,  మంత్రులు పూర్తిగా రాజకీయంగా జోక్యం చేసుకుని ఇష్టానుసారంగా దోచుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. చివరికి సింగరేణి అధికారులు ఫైళ్లతో కేసీఆర్ కుటుంబ సభ్యుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగే పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు. కార్మికుడి డ్యూటీ షిఫ్ట్ మార్పు కోసం కూడా ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మికులు అనేకసార్లు ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించినా నాటి సీఎం కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదని గుర్తు చేశారు. సింగరేణిలో 51 శాతం రాష్ర్ట ప్రభుత్వం వాటా ఉంటే.. 49 శాతం కేంద్ర ప్రభుత్వం 

 వాటా ఉందని, పెత్తనం వారిదే కాబట్టి కేసీఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా ఎడాపెడా సింగరేణిని రాజకీయ క్షేత్రంగా వాడుకుందన్నారు. సింగరేణిపై ఆధారపడ్డ కుటుంబాల గురించి ఏరోజు కూడా ఆలోచన చేయలేదని, మాజీ సీఎం కేసీఆర్.. ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడం కోసం సింగరేణిని ఒక సాధనంగా చూశారే తప్ప.. సింగరేణి సంస్థ అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాటల అని, ఆ పార్టీది చేతల ప్రభుత్వం కాదని... నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణిలో జరిగిన దోపిడీ, బిల్లుల అవకతవకలపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సింగరేణిలో జరిగిన దోపిడీపై విచారణను కోరుతూ కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ర్ట ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు. 

సింగరేణి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తాము కృషిచేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో సింగరేణి యాత్ర పేరుతో బొగ్గు బావులు విస్తరించిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించానని, మోదీ ప్రభుత్వం సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామనండం అబద్ధమని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. 85 శాతం బొగ్గును విద్యుత్ ఉత్పత్తి కోసం సరఫరా చేసుకుంటున్నామని, దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక వ్యవస్థ, ప్రజల జీవన వ్యవస్థ బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడిందన్నారు.

సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా నిలబడతామని తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలో బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుకునేలా కృషి చేస్తామన్నారు. రాష్ర్ట ప్రభుత్వం బొగ్గు గనుల వేలం సకాలంలో జరపకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. దీనిపై రాష్ర్ట ప్రభుత్వం కూడా స్పందించాలని కోరారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన బాధలో కేటీఆర్ ఉన్నారని, ముఖ్యమంత్రి అవుతున్నట్లుగా అనేక కలలు కన్నారని, ప్రజలు మాత్రం తిరస్కరించారని తెలిపారు. బొగ్గు గనుల కోసం సింగరేణి ఓపన్ యాక్షన్‌కు వెళ్లడం ద్వారా మాత్రమే లాభపడుతుందని, నామినేషన్ పద్ధతిలో తీసుకుంటే నష్టం వస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. 

ఇప్పటివరకు 107 బొగ్గు గనుల వేలం

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 9 రౌండ్లలో 107 బొగ్గు గనుల వేలం వేసినట్లు వివరించారు. ఫలితంగా రాష్ర్ట ప్రభుత్వాలకు సుమారు రూ. 37 వేల కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. బొగ్గు గనుల వేలంతో 14 శాతం చొప్పున రాష్ర్ట ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోదని వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా ఒడిశాలో ఏడాదికి రూ.36 వేల కోట్ల చొప్పున అక్కడి రాష్ర్ట ప్రభుత్వానికి ఆదాయం లభిస్తోందని తెలిపారు.

నీట్ పరీక్షలకు సంబంధించి ఎక్కడా పేపర్ లీక్ కాలేదని, దీనికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. విద్యార్థులకు న్యాయం చేసేలా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే జరిపి.. బొగ్గు ఉత్పత్తిని పెంచుకునేలా, ఉపాధి అవకాశాలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప హామీలన్నీ తుంగలో తొక్కారు..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించిందని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. 6 గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేస్తామని సోనియా గాంధీ తన సంతకంతో కూడిన ఉత్తరాన్ని ప్రతి ఇంటికి పంపించారని, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకే గ్యారంటీ లేకుండా పోయిందన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ తప్ప మిగతా హామీలను తుంగలో తొక్కారని, మహాలక్ష్మి పథకం రూ. 2500 ఆర్థిక సహాయం, కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డులు, నిరుద్యోగులకు రూ. 4 వేల చొప్పున భృతి ఇస్తామని చెప్పి.. నేడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. విద్యార్థి,  నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ర్ట యువ మోర్చా ఆధ్వర్యంలో టీజీపీఎస్‌సీ ముందు ధర్నా చేస్తే విచక్షణారహితంగా పోలీసులు దాడి చేయడాన్ని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మాజీ ఎంపీ పీ రాములు, బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమ తదితరులు ఈ సమావేశంల పాల్గొన్నారు.