పెంచిన వేతనాలు అమలు చేయాలి
కలెక్టరేట్ల ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన
నిర్మల్/భద్రాద్రి కొత్తగూడెం, జూన్11 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాలు అమలుచేయాలని, పెండిం గ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైనా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తమకు రూ.10 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారులు వారితో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రమేశ్, లక్ష్మి, మోనవ్వ, హంస పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు కార్మికుల భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మధ్యా హ్న భోజన కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నరాటి ప్రసాద్ డిమాండ్ చేశా రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులకు కనీస వేతనం రూ.10వేలు చెల్లిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు.
గిరిజన సంక్షేమ శాఖ పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుల ఆకలి బాధలు తీర్చాలని, పెండింగ్‌లో ఉన్న 17 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐడీఓసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్బంగా ఆసంఘం జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి మాట్లాడుతూ.. ఔట్‌సోర్సింగ్ కార్మికులు వేతనాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బడ్జెట్ విడుదల చేసి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.






