12 August, 2026 | 2:50 AM

ఢిల్లీలో భారత్, అఫ్గన్ టీ20 సిరీస్

12-08-2026 12:00 AM

షెడ్యూల్ ఖరారు చేసిన ఏసీబీ

ముంబై, ఆగస్టు 11: అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) టీమిండియాతో టీ20 సిరీస్ను ఖరారు చేసింది. దీనిలో భాగంగా భారత జట్టుతో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. అయితే అఫ్గాన్ భారత్లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుంది. అఫ్గానిస్తాన్లో మ్యాచ్లు నిర్వహించే పరిస్థితి లేకావడంతో ఏసీబీ భారత్ లేదంటే యూఏఈలలో పలు సిరీస్లకు ఆతిథ్యమిస్తోంది.

ఈ క్రమంలో టీమిండియాతో భారత్ వేదికగానే తలపడేందుకు సిద్ధమైంది. సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మూడు మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లకు అఫ్గానిస్తాన్ భారత్లో ఆతిథ్యం ఇచ్చింది.

2017లో ఐర్లాండ్తో వైట్బాల్ సిరీస్ ఆడిన అఫ్గాన్ జట్టు.. 2017లో విండీస్తో ఆల్ ఫార్మాట్ సిరీస్ ఆడింది. ఇటీవల అఫ్గానిస్తాన్ భారత పర్యటనకు వచ్చి ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత్.. అఫ్గాన్ను ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక మూడు వన్డేల సిరీస్లోనూ ఆతిథ్య భారత జట్టు.. అఫ్గాన్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. తాజాగా మరోసారి అఫ్గాన్ టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈసారి భారత్లో ఆతిథ్య దేశంగా అఫ్గాన్, టీమిండియాతో టీ20 సిరీస్ ఆడుతుంది.