calender_icon.png 10 November, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్

26-01-2025 12:24:20 AM

  1. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు
  2. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ విధానం ద్వారా తగ్గనున్న ఆర్థిక భారం
  3. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
  4. మహాకుంభమేళా దేశ వారసత్వ సంపదకు నిదర్శనమని వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 25: సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా భారత్ ముందుకు వెళ్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానం పాలనలో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుందని ముర్ము పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భం గా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ వన్ నేషన్- వన్ ఎలక్షన్ పాలసీ ద్వారా ఆర్థిక భారం తగ్గుతుం దన్నారు. కొన్ని దశాబ్దాలుగా దేశంలో కొనసాగుతున్న వలసవాద ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందులో భాగంగానే బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు.

కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టాలు నేర న్యాయ వ్యవస్థలో శిక్షకు బదులుగా న్యాయాన్ని అందిస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలకు నేరాల నుంచి రక్షణ కల్పిస్తాయన్నారు. అలాగే ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాను ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా దేశ నాగరికత వారసత్వ సంపదకు నిదర్శమని రాష్ట్రపతి పేర్కొన్నారు.

గడిచిన 75ఏళ్లలో దేశం ఎన్నో విజయాలను సాధించిందన్నారు. స్వాతంత్య్ర సమయంలో దేశంలోని అనేక చోట్ల తీవ్రమైన పేదరికం, ఆకలి వంటి సమస్యలు ఉన్నట్టు ముర్ము గుర్తు చేశారు. అయినప్పటికీ దేశాభివృద్ధి కోసం అవకాశాలను సృష్టించికున్నట్టు వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ముర్ము తెలిపారు.

ఇందులో రైతులు, కార్మికుల కృషి ఎంతైనా ఉందన్నారు. ఇటీవల కాలంలో దేశం అధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే రైతులు, కార్మికుల ఆదాయం పెరిగినట్టు వెల్లడించారు. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటంతోపాటు ఎంతో మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు.

ఈ ఏడాది ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా 150వ జయంతి దినోత్సవాన్ని జరుపుకొన్నట్టు రాష్ట్రపతి గుర్తు చేశారు. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర పోరాటంలో జీవితాలను త్యాగం చేసిన సమరయోధులను స్మరించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటివి కేవలం ఆధునిక భావాలు మాత్రమే కాదన్నారు.

అవి ఎల్లప్పుడూ మన నాగరికత వారసత్వంలో అంతర్లీనంగా ఉన్నాయన్నారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. దేశ రాజ్యాంగ నిర్మాణంలో మహిళల సేవలను రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు.