10-11-2025 09:19:31 AM
హైదరాబాద్: అందెశ్రీ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజల కవి అందెశ్రీ( Ande Sri passed away) మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మరణం సాహితీ లోకానికే కాదు వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపచేసిన గొప్ప యోధుడు అందెశ్రీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. నిత్యం పేదల పక్షాన గొంతుక వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” గేయంగా నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని సీఎం సూచించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.