14 July, 2026 | 4:51 AM

ప్రతీకారానికి వేళాయె

14-07-2026 12:00 AM

నేడు భారత్, ఇంగ్లాండ్ తొలి వన్డే

మ.3.30 గంటలకు ప్రారంభం

రోకో రాకతో భారత్‌కు బలం

బర్మింగ్‌హామ్, జూలై 12: ఇంగ్లాండ్ టూర్‌లో భారత్ వన్డే సమరానికి రెడీ అయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మంగళవారం బర్మింగ్ హామ్ వేదికగా జరగబోతోంది. టీ20 సిరీస్ వైట్‌వాష్ పరాభవం నుంచి కోలుకుంటున్న టీమిండియా శుభారంభం చేయాలని ఎదురుచూస్తోంది.

సీనియర్లు కోహ్లీ, రోహిత్, బుమ్రా, రాహుల్ వంటి ప్లేయర్స్ జట్టులోకి రావడంతో బలం పెరిగింది. కొన్ని రోజులుగా ఇంగ్లీష్ కండీషన్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీ, రోహిత్‌లపై భారీ అంచనాలున్నాయి. అటు గిల్, రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా వన్ డౌన్ లో కోహ్లీ ఆడతాడు. తర్వాత శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు చోటు దక్కనుంది.

అటు పేస్ విభాగంలో బుమ్రా రాకతో మరింత బలం పుంజుకుంది. ఐపీఎల్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన బుమ్రాకు ఈ సిరీస్ కీలకం కానుంది. అలాగే అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్‌లకు కూడా చోటు లభించనుంది. ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ ల రూపంలో మరో ఇద్దరు అందుబాటులో ఉన్నారు. మరోవైపు తొలి వన్డే కోసం ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది. యువ ఆల్రౌండర్ జేకబ్ బెతెల్‌ను ఓపెనర్‌గా పంపాలని నిర్ణయించింది.

బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, సామ్ కరన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. భారత బ్యాటిం గ్ బలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. ఇటీవల టీ20 సిరీస్లో భారత్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. గత రికార్డులను చూస్తే ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటి వరకూ 44 వన్డేలు ఆడిన భారత్ 18 మ్యాచ్‌లలో గెలిచి, 23 మ్యాచ్ లలో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా మరో 2 ఫలితం తేలలేదు. చివరి సారి గా ఇక్కడ 2022లో ఆడినప్పుడు 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.

తుది జట్ల అంచనా

భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, దూబే/వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, బుమ్రా, అర్షదీప్, కుల్దీప్, గుర్నూర్ బ్రార్

ఇంగ్లాండ్: బెథెల్, డకెట్, రూట్, బ్రూక్(కెప్టెన్), బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, ఆర్చర్, డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్