31-07-2025 12:39:39 AM
గతం కంటే స్వల్పంగా అంచనాలు పెంచిన ఐఎంఎఫ్
న్యూఢిల్లీ, జూలై 30: భారత వృద్ధిరేటును అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) 6.4శాతంగా అంచనా వేసింది. ఇది ఏప్రిల్‌లో అంచనా వేసిన 6.2శాతం కంటే స్వల్పంగా ఎక్కువ. గత కొన్ని నెలలుగా భారత వృద్ధి అంచనాలను దాదాపు అన్ని రేటింగ్ సంస్థ లు తగ్గించుకుంటూ వస్తున్న ఈనేపథ్యంలో ఐఎంఎఫ్ అంచనా మెరుగ్గా ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తత లు నెమ్మదించడంతో భారత వృద్ధి రేటును పెంచినట్టు తెలుస్తోంది.
తాజాగా జూలై వర ల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ అప్‌డేట్ నివేదికలో ఐఎంఎఫ్ కీలక విషయాలను వెల్లడించింది. 2025, 2026 సంవత్సరాల్లోనూ భారత్ 6.4శాతం మేర వృద్ధిరేటును నమోదు చేయనుంది. ఏప్రిల్‌లో ప్రకటించిన దానికంటే అమెరికా టారిఫ్ ప్రభావం తక్కువగా ఉం డటం, బలహీనమైన యూఎస్ డాలర్ కారణంగా పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఈ పనితీరును నిలబెట్టుకోవడానికి ఐఎంఎఫ్ కీలకమైన విధాన ప్రాధాన్యతలను నొక్కిచెప్పింది.
వ్యవసాయేతర ఉద్యోగాలను సృష్టిం చడం, కార్మికుల్లో నైపుణ్యతను పెంచడం, మౌలిక సదుపాయాలు విస్తరించడం, వాణి జ్య అడ్డంకులను తగ్గించడం, విద్యతో నిరంతర పెట్టుబడి, భూసంస్కరణలు, మెరుగైన సామాజిక భద్రత..వంటివి మరింత వృద్ధికి అవసరమని తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 3 శాతంగా, 2026 నాటికి 3.1శాతంగా ఉండనుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.