18 April, 2026 | 7:55 AM

రైతులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ఉపయోగపడుతుంది

09-06-2025 07:34 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): విద్యుత్తు వినియోగం లేకుండా, రైతుపై ఏలాంటి ఆర్థిక భారం పడకుండా ఇందిరా సౌర గిరి జల వికాసం(Indira Soura Giri Jala Vikasam) పథకం ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ(District Collector Ila Tripathi) అన్నారు. గతంలో ఈ పథకాన్ని ఇందిర జల ప్రభ, తదితర పేర్లతో అటవీ ప్రాంతంలోని గిరిజన రైతులకు అమలు చేయడం జరిగిందని, అయితే విద్యుత్తు ద్వారా బోర్లతో సాగునీటిని అందించే పద్ధతి ఉండేదని, ఇందిర సౌర గిరి జల వికాస పథకం కింద రైతులకు ఇలాంటి ఇబ్బందులను తొలగించడం, ముఖ్యంగా ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ ఇందిర సౌర గిరిజల వికాస పథకం దోహదపడుతుందని తెలిపారు. 

జిల్లాలోని గిరిజన ప్రాంతాలైన దేవరకొండ, మిర్యాలగూడ తదితర గిరిజన ప్రాంతాలలోని 14 మండలాలలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు. గుర్తించిన ఈ 14 మండలాల్లో సుమారు 6800 మంది గిరిజనులను ఇందిర సౌర గిరి జల  వికాస పథకానికి గుర్తించడం జరిగిందని, ఆర్ ఓ ఎఫ్ ఆర్ కింద గిరిజనులకు పంపిణీ చేసిన భూముల్లో ఈ పథకం కింద సాగు చేసుకునే అవకాశం ఉన్నట్లు ఆమె వెల్లడించారు. 

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ అనంతరం ఇందిర సౌర గిరి జల వికాస పథకంపై ఆమె సమీక్షించారు. గిరిజన భూములు వర్షాధారమైనప్పటికి, ఇందిర సౌర గిరి జల వికాస పథకం కింద బోర్ మోటార్ ని ఏర్పాటు చేసి సోలార్ ద్వారా విద్యుత్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద ఒక యూనిట్ కు 6 లక్షలు ఖర్చు చేయడం జరుగుతుందని, ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టా పొందిన, రెండున్నర ఎకరాల పొలం ఉన్న గిరిజన రైతులకు సోలార్ యూనిట్ ను ఇవ్వడం జరుగుతుందని, మొదటి సంవత్సరం జిల్లాలో 270 మంది గిరిజనులకు ఈ పథకం అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

జిల్లా స్థాయి కమిటీలో పూర్తిగా చర్చించిన మీదట కార్యచరణ ప్రణాళికను రూపొందించి మండల స్థాయిలో ప్రణాళిక అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత మండల ప్రత్యేక అధికారులు సైతం భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్టిఐ ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అధికారులను రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. ఈసీఐఎల్ ద్వారా దివ్యాంగులకు పంపిణీ చేయనున్న మోటార్ బ్యాటరీ సైకిళ్లు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి వై.అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, జిల్లా అధికారులు ఉన్నారు.