కొలిక్కిరాని ఇందిరమ్మ కమిటీలు?
- జిల్లా ఇన్‌చార్జి మంత్రి వద్ద జాబితా పెండింగ్
- ప్రక్రియ పూర్తి కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు
- కమిటీలకు సవాలుగా లబ్ధిదారుల ఎంపిక!
వికారాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): తాము అధికారంలోకి వచ్చాక నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావడంతో లబ్ధిదారులు కొత్త ఇళ్లను ఎప్పుడు మంజూరు చేస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల కింద ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ఈ కమిటీల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్ధేశంతో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ఇందిరమ్మ కమిటీల నియామకాలకు సంబంధించి పలు నిబంధనలు విధించారు.
అక్టోబర్‌లోనే కమిటీల నియామకం పూర్తయ్యింది. జిల్లా ఇన్‌చార్జి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వద్దకు ఫైల్ చేరింది. కాగా ఇప్పటివరకు ఆ జాబితాకు తుది ఆమోదదం లభించలేదు. జిల్లాలో తాండూరు, కొడంగల్, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో మొత్తం 20 మండలాలు ఉన్నాయి.
తొలివిడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున జిల్లాకు దాదా పు 14 వేల ఇండ్లు మం జూరు కానున్నాయి. జిల్లా మొత్తం 585 గ్రామ పంచాయతీలు, నాలుగు ము న్సిపాలిటీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో గ్రామం యూనిట్‌గా, మున్సిపాలిటీల్లో వార్డుకోటి చొప్పున కమిటీలు వేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు.
కమిటీల్లో వీరికి చోటు
గ్రామ పంచాయతీల పాలకవర్గం ముగిశాక ప్రస్తుతం ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉన్నారు. వీరితో పాటు గ్రామానికి చెందిన ఒక బీసీ, ఒక ఎస్సీ, ఎస్టీకి, ఒక జనరల్, మహిళా సంఘాల్లోని ఇద్దరికి స్థానం కల్పించారు. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ ఒకరు, మెప్మా నుంచి ఇద్దరు, బీసీ, ఎస్సీ, ఎస్టీ నుంచి ఒక్కొక్కరు ఉండనున్నారు. వీరు అర్హులైన వారిని గుర్తించనున్నారు. ఎంపీడీవోలు గ్రామపంచాయతీల లిస్ట్, మున్సిపల్ కమిషనర్లు వార్డు కమిటీల జాబితాను పంపించారు.
నియోజకవర్గానికి 3,500 ఇండ్లు
ప్రజాప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయించారు. ఈ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా 14 వేల ఇళ్ల వరకు మంజూరయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడం, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ వికారాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అదనంగా మరిన్ని ఇండ్లు మంజూరు కావొచ్చిన జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. కమిటీల ఎంపిక పూర్తి చేసి, ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు.
లబ్ధిదారుల ఎంపిక సవాలే
జిల్లాలోని మున్సిపాలిటీల్లో కొన్ని వార్డు ల్లో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లుండగా.. మరికొన్ని వార్డుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. అయినప్పటికీ కమిటీలు ఏర్పాటు చేసి జాబితాను సిద్ధంగా పెట్టుకున్నారు. మున్సిపాలిటీల్లో రెండు పార్టీల చెందిన కౌన్సిలర్లు ఉండటంతో లబ్ధిదారుల ఎంపిక సవాలుగా మారనుంది. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొనే అవకాశం ఉంది.
తాండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలోనే రెండు గ్రూపులు ఉన్నాయి. దీంతో కమిటీలు కొలిక్కి రావడం లేదని సమాచారం. ఇక్కడ ఎవరి జాబితాను వారే వేర్వేరుగా ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. అయితే ఇందిరమ్మ కమిటీల నియమకాల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లోనే స్పష్టత లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతు న్నాయని పలువురు విమర్శిస్తున్నారు.




