calender_icon.png 14 May, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ నుంచి ఉగ్రచర్యలు ఆగేదాక సింధూ జలాలు బంద్

14-05-2025 01:39:17 AM

  1. పాకిస్థాన్‌కు తేల్చిచెప్పిన భారత్
  2. పీవోకేపై భారత్ వైఖరి మారలేదు.. ద్వైపాక్షిక చర్చలే మార్గం
  3. ఏ దేశం మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోం
  4. పాక్ పీవోకేను ఖాళీ చేయడమే మిగిలి ఉంది
  5. అమెరికాతో వాణిజ్య అంశాలే చర్చకు రాలేదు
  6. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ వెల్లడి

న్యూఢిల్లీ, మే 13: ‘సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ తన మద్దతు ఆపేంత వరకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించం. కాల్పుల విరమణపై డీజీఎంవోలు చర్చించారు. పీవోకే పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గం. పాక్ పీవోకేను ఖాళీ చేయడం మాత్రమే మిగిలి ఉంది.’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పాకిస్థాన్‌కు తేల్చిచెప్పారు.

మంగళవారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పా టు చేసి పలు అంశాలను స్పష్టం చేశారు. ‘సింధూ నదీ జలాల ఒప్పందం మంచితనం వల్ల కుదిరింది. పాకి స్థాన్ మాత్రం ఏండ్లుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసింది. క్యాబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ (సీసీ ఎస్) ఏప్రిల్ 23న తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతం సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేశాం.’

‘భారత్ అణుయుద్ధ బెదిరింపులను ఏ మాత్రం సహించదు. మేము ప్రస్తుతం మాత్రమే నిశబ్దంగా ఉన్నాం. భవిష్యత్‌లో ఎలా ఉంటుందనేది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. మే 10న పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం అవనుందని పలు నివేదికలు వచ్చినా.. అందులో అణ్వాయుధాల గురించి చర్చ జరగలేదని తర్వాత పాక్ విదేశాంగ మంత్రే స్పష్టం చేశారు.

ఆపరేషన్ సిందూర్ అనేది ఉగ్రవాదంపై భారతదేశ కొత్త విధానం. కొత్త గీత గీయబడింది. కాల్పుల విరమణపై మా వైఖరి స్పష్టంగా ఉంది. మాతో సంప్రదింపులు జరిపిన ప్రపంచ దేశాలకు కూడా ఇదే చెప్పాం. ఉగ్రవాదుల అణచివేతే మా ప్రధాన లక్ష్యం. కశ్మీర్ విషయంలో భారత వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. ద్వైపాక్షిక చర్చలు కాకుండా మరే ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించం.

పీవోకేను పాక్ ఖాళీ చేయాల్సిందే. కాల్పుల విరమణ ప్రతిపాదన కూడా పాకిస్థాన్ వైపు నుంచే వచ్చింది. కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదు. ఆపరేషన్ సిందూర్‌పై భారత్-అమెరికాల మధ్య చర్చలు జరిగాయని అయితే ఇందులో వాణిజ్యం ప్రస్తావన రాలేదన్నారు.

టీఆర్‌ఎఫ్ లష్కరే తోయిబాకు చెందినదే. ఈ సంస్థపై అంతర్జాతీయంగా నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. భారత్ నడుమ న్యూక్లియర్ యుద్ధాన్ని ఆపినట్టు ట్రంప్ చేసిన ప్రకటనను విదేశాంగ శాఖ తోసిపుచ్చింది.