హైటెక్స్‌లో పారిశ్రామిక ఎక్స్‌పో ప్రారంభం
ఇండోమాచ్ ‘బీ2బీ ఇండస్ట్రియల్ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ ఎక్స్‌పో’
హైదరాబాద్, జూన్ 12(విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన పారిశ్రామిక సదస్సులలో ఒకటిగా నిలిచే మూడు రోజుల ‘ఇండోమాచ్ హైదరాబాద్ 2026’ బీ2బీ ఇండస్ట్రియల్ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ ఎక్స్పో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని హాల్ నెంబర్ 1లో శనివారం ప్రారంభమైంది. ఈనెల 14వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరగనుంది. సందర్శకులకు ప్రవేశం ఉచితం. ఈ ఎక్స్‌పో సందర్శన సమయం ఉదయం 11 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఉంటుంది.
ఈ సందర్భంగా తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ (హైదరాబాద్) ప్రెసిడెంట్ కే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటన్నారు. ఇది పారిశ్రామిక వృద్ధికి అపారమైన అవకాశాలను అందిస్తోందన్నారు. ముఖ్యంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పారిశ్రామికీకరణ వేగం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఇది భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు మన రాష్ట్రాన్ని ఒక అగ్రగామి గమ్యస్థానంగా మార్చిందన్నారు. ఈ డైనమిక్ వాతావరణం లో హైదరాబాద్లోని ఇరవై వేల ఎంఎస్‌ఎంఈలు, అనుబంధ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, తమ మార్కెట్ పరిధిని విస్తరించుకోవడానికి, వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి బీ2బీ వేదికలు ఎంతైనా అవసరమన్నారు.
తపారియా టూల్స్ లిమిటెడ్ (ముంబై) జనరల్ మేనేజర్ బీ పిళ్ళై మాట్లాడుతూ తపారియా టూల్స్ భారతదేశంలోనే అగ్రగామి హ్యాండ్ టూల్స్ తయారీ సంస్థ అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇండోమాచ్ ప్రదర్శనలలో చురుగ్గా పాల్గొంటున్నామన్నారు. ఈ హైదరాబాద్ వేదిక కావడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఇండోమాచ్ డైరెక్టర్ మనీష్ సిన్హా మాట్లాడుతూ ఇండోమాచ్ హైదరాబాద్‌కు ఇది ఐదవ ఎడిషన్ అన్నారు.
దీని ద్వారా దేశ నలుమూలల నుంచి 100కు పైగా ప్రముఖ కంపెనీలు ఒకే చోటకు వచ్చాయన్నారు. ఈ ప్రదర్శన అటు ఎగ్జిబిటర్లకు, ఇటు సందర్శకులకు ఎంతో విలువైనదిగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ (హైదరాబాద్) ప్రెసిడెంట్ కే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
గౌరవ అతిథులుగా ఐఏఎల్‌ఏ, సీఐఈ గాంధీనగర్ చైర్మన్ పీ స్వామి గౌడ్, తపారియా టూల్స్ లిమిటెడ్, ముంబై జనరల్ మేనేజర్ బీ పిళ్ళై, చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ కార్యదర్శి పీఎస్ మోహన్, ఇండోమాచ్ డైరెక్టర్లు సుధీర్ భోలే, మనీష్ సిన్హా, సచిన్ శర్మ, సుమిత్ పోర్వాల్ పాల్గొన్నారు. కాగా పరిశ్రమలను సరికొత్త సాంకేతికతలు, యంత్రాలు, వ్యాపార అవకాశాలతో అనుసంధానించడం ద్వారా ఈ వృద్ధిని మరింత బలోపేతం చేయడమే ‘ఇండోమాచ్ హైదరాబాద్ 2026’ ముఖ్య ఉద్దేశ్యం.






