18-08-2025 05:07:01 PM
జాతి హనన చర్యలకు వ్యతిరేకంగా వేలాది మందితో ప్రదర్శన
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): పాలస్తీనా సంఘీభావ కమిటీ పిలుపు మేరకు నల్లగొండ పట్టణంలో ఇజ్రాయెల్ గాజాలో చేస్తున్న జాతి హనన చర్యలకు వ్యతిరేకంగా వేలాది మందితో ప్రదర్శన నిరసన ర్యాలీ సాగింది. ప్రదర్శిస్తూ 'సేవ్ గాజా' అనే నినాదంతో హెూరెత్తించారు. వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ ర్యాలీలో నడిచారు. మార్చ్ ఫర్ హ్యుమానిటీ పేరుతో గాజాలో పాలస్తీనా జాతి హననానికి ఇజ్రాయెల్ చేస్తున్న దుశ్చర్యలను ఖండించారు. సోమవారం పట్టణంలోని ప్రతిక్ జూనియర్ కాలేజ్ నుంచి ఇక్బాల్ మినార్, ప్రకాశం బజార్ మీదుగా క్లాక్ టవర్ వరకు ఇజ్రాయిల్ పై నిరసన వ్యక్తం చేస్తూ పాలసీనకు మద్దతుగా సంఘీభావం ర్యాలీ చేపట్టారు.
ముఖ్యంగా ర్యాలీలో చిన్నారుల వేషధారణ గాజాలో చిన్నారుల మృతి కాండను తెలిపే విధంగా చిన్నారుల వేషధారణ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నల్లగొండ గడియారం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో నిర్వాహకులు ఉలేమాలు, మత పెద్దలు మాట్లాడుతూ పాలస్తీనా, ఇజ్రాయెల్ ఘర్షణలకు కారణాలు ఏవైనా ఉండవచ్చు కానీ చిన్నారులు, మహిళలేం పాపం చేశారని ప్రశ్నించారు. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ దాడులు నిలువెత్తు మానవ హక్కుల ఉల్లంఘన, అక్షరాలా అన్యాయం అన్నారు.
ఈ దౌర్జన్యం వల్ల గాజాలో నీరు, విద్యుత్, ఆహారం, ఔషధాల కొరత తీవ్రమైందని, ఆసుపత్రులు, పాఠశాలలు ధ్వంసమయ్యాయని, పౌరులెందరో చనిపోయారని, పసి పిల్లలు మరణిస్తున్నారని, ఇప్పటి వరకు 18,500 పసి హత్యలు జరిగాయని, అనధికారిక లెక్క ప్రకారం 40 వేల మంది చనిపోయారని ఆరోపించారు. ర్యాలీలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు , సిపిఎం , సిపిఐ, మాస్ లైన్, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పాల్గొన్నారు. ప్రదర్శనలో వివిధ మైనారిటీ సంస్థలకు చెందిన మహిళలు, యువకులు జాతీయ జెండాలు, పాలస్తీనా జెండాలతో సంఘీభావం తెలిపారు.