మియాపూర్‌లో మౌలిక వసతుల పనులు వేగవంతం
శేరిలింగంపల్లి, జూన్ 19 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీతోపాటు జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు మియాపూర్ ఎక్స్ రోడ్స్లోని గ్రేడ్ సెపరేటర్ పనులను పరిశీలించారు.పనుల పురోగతి, భూసేకరణ స్థితిని సమీక్షించిన వారు,పనులు సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పెండింగ్ ప్రక్రియలను వేగవంతం చేయాలని, శాఖల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు. మియాపూర్ చౌరస్తా ఫ్లైఓవర్, కూకట్పల్లి వై జంక్షన్ రోడ్డు విస్తరణ, మంజీరా పైప్లైన్ రోడ్ విస్తరణ, ఐడీఎల్ సరస్సు పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమీక్షించారు. ఈ పనులు ట్రాఫిక్ రద్దీ తగ్గించి, మియాపూర్ కూకట్పల్లి ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయని అధికారులు తెలిపారు.






