వినూత్న ఆవిష్కరణలే లక్ష్యం
విజ్ఞాన్స్ యూనివర్సిటీలో వర్క్‌షాప్
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని విజ్ఞా న్స్ యూనివర్సిటీలో ‘డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్‘ అంశంపై మూడు రోజుల ఫ్యాకల్టీ వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఐఐటీ బాంబే ప్రొఫెసర్ డాక్టర్ అచియా రవి పూవయ్య మాట్లాడుతూ.. దేశ సమస్యల పరిష్కారానికి విద్యార్థులను ప్రోత్సహించి, గ్రామీణ సమస్యలపై పరిశోధనలు చేసేలా అధ్యాపకులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
జెల్లో ల్యాబ్స్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ అజంతా సేన్ భారతీయ సంస్కృతిని లోతుగా అర్థం చేసుకుంటే సరికొత్త పరిష్కారాలు లభిస్తాయని అన్నారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనమ్ మాలకొండయ్య మాట్లాడుతూ, ప్రజల నిజమైన అవసరాలను గుర్తించడమే డిజైన్ థింకింగ్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు, అధ్యాపకులు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.






