ఓటర్ల సౌకర్యార్థం కొత్త పోలింగ్ కేంద్రాల పరిశీలన
వెంకటాపూర్, జూలై 30 (విజయక్రాంతి): రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ములుగు ఎన్నికల నమోదు అధికారి (ఆర్డీఓ) కృష్ణవేణి గురువారం ప్రతిపాదిత, కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మండలంలోని సుబ్బక్కపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో కొత్తగా పోలింగ్ కేంద్రం నం.5/ఏ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండటంతో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా, పెర్కపల్లి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం నం.3/ఏను కూడా ఈఆర్వో సందర్శించి పరిశీలించారు. సుబ్బక్కపల్లి, పెర్కపల్లి గ్రామపంచాయతీలు గ్రామసభల ద్వారా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. రానున్న 109-ములుగు శాసనసభ నియోజకవర్గ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, బిఎల్‌ఓ సూపర్వైజర్ భవాని ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ నితీష్, గిర్దావర్ నగేష్, బిఎల్‌ఓ లు అరుణ్, ఖాజా, జితేందర్, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.






