17-12-2025 01:19:56 AM
బాలకృష్ణ, బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్‌బస్టర్ ‘అఖండ 2: ది తాండవం’. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
అనివార్య కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఒక వారం రోజులు ఆలస్యమైంది. అయితే, మా ఆలోచన అంతా బాలకృష్ణ అభిమానుల గురించే. రెండు రోజులు ముందు చెప్తే అర్థం చేసుకుంటారు. కానీ, రెండు గంటలకు ముందు టికెట్లు తీసుకుని థియేటర్స్ దగ్గరకు వెళ్లిన తర్వాత వాయిదా అని చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది. అయితే ఆ పరిస్థితి గురించి మేము భయపడలేదు. మాకు బాలకృష్ణ ఉన్నారనే ధైర్యం ఉంది. ఆయన మాకు ఇచ్చిన సపోర్టు మర్చిపోలేం.
దేశభక్తి దైవభక్తి ఈ రెండు కలగలిపిన సినిమాలు లేవు. ‘-అఖండ’ చూసి జనాల అంచనాలు భారీగా పెరిగాయి. అప్పుడు ప్రకృతిలో పసిబిడ్డ పరమాత్మ తర్వాత దేశం, ధర్మం, దైవమే నాకు కనిపించింది. అలాంటి కథతో వస్తేనే అభిమానుల అంచనాలను అందుకోగలం. అందుకే ఆ అంశాన్ని టచ్ చేశాం.
ఇది అవెంజర్స్‌కి స్కోప్ ఉన్నంత సినిమా. నిజానికి అవెంజర్స్, సూపర్ మాన్, బ్యాట్ మాన్.. ఇవన్నీ కూడా పుట్టించినవి. కానీ మనకున్న పాత్రలన్నీ సత్యాలు. కురుక్షేత్రంలో అన్ని ఆయుధాలు వాడినట్లు రేడియేషన్ కనిపిస్తుంటుంది. అంత ఘనమైన చరిత్ర ఉంది. ఇలాంటి సినిమాలు మనం ఎన్నైనా చేయొచ్చు. సంకల్పం, ఓపిక ఉంటే చాలు.
సూపర్ హ్యూమన్‌కి లాజికల్‌గా వివరణ ఇచ్చాం. నిజానికి అన్ని కమర్షియల్ సినిమాల్లో ఉన్న యాక్షన్ సీన్లు ఇందులో ఉంటాయి. కానీ ఎక్కడో కాస్త అతీతం. లేకపోతే ఈ క్యారెక్టర్ అలా సూపర్ పవర్‌గా అవ్వదు. ఇందులో మనిషితో దిష్టి తీసే ఒక సన్నివేశం ఉంటుంది.. మామూలుగా మనుషులు గుమ్మడి కాయలతో తీస్తారు. అష్టసిద్ధి శక్తి సాధన చేసి వచ్చిన వాళ్లు తొలిసారి ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఎంత పవర్ ఉంటుందో ఆ సన్నివేశంతో చూపించాం.
సినిమా అంటే ఒక యజ్ఞం. ప్రతిదీ చాలా కేర్ తీసుకుంటూ చేయాలి. పార్ట్ వన్‌లో అఘోర క్యారెక్టర్ అందరికీ సుపరిచితం. 12 ఏళ్ల తర్వాత ఒక సాధనలో ఉన్న వ్యక్తి బయటకు వస్తే ఎలా మాట్లాడుతాడు? అలాంటి వేరియేషన్స్ వేసుకుని డబ్బింగ్ రూంలో బాలయ్యతో ప్రతిదీ వివరంగా చర్చించి చేశాం.
135 రోజుల్లో సినిమా తీశాను. సెప్టెంబర్ 25 సినిమా రిలీజ్ అన్నాం. అనుకున్నట్టే కాపీ రెడీ అయింది. కానీ, అదే సమయానికి ‘ఓజీ’ ఉంది. ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం అంత కరెక్ట్ కాదు. అప్పుడు బాలయ్య తమ్ముడికి దారి ఇచ్చేద్దాం, మనం తర్వాత వద్దామన్నారు. అలా మేము పక్కకు వచ్చాం.
ఈ సినిమా వరకు మాత్రం ఆ భగవంతుడే పక్కన ఉండి నడిపించాడు. మేము చేసిన వాతావరణంలో ఎవరూ చేయలేరు. అసాధ్యం. కొన్ని లొకేషన్ ఫోటోలు చూపిస్తే నిజంగా భయపడతారు. అయినా మేం భయపడలేదు.
ఒక మంచి సినిమా తీసి ఆశించాల్సింది డబ్బు కాదు గౌరవం. అలాంటి గౌరవం వచ్చింది. సహజంగా థియేటర్స్ విజిట్ కి వెళ్లినప్పుడు అందరూ నిలబడి విజల్స్, క్లాప్స్ కొడతారు. కానీ ఈ సినిమాకు వెళ్లినప్పుడు అందరూ లేచి చేతులెత్తి దండం పెట్టారు. నిజంగా ఇది చాలా గొప్ప అనుభూతి.
ఈ సినిమా చూసిన తర్వాత పౌరాణికం సినిమా చేస్తే బాగుంటుందని అభిప్రాయం అందరి నుంచి వ్యక్తమవుతోంది. నాకూ అలాంటి ఆలోచన ఉంది.
నాకు ప్రతి జోనర్ చేయాలని ఉంది. అన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న తర్వాతే చేయాలి. -మరో 10 రోజుల్లోనే నా నెక్స్ట్ సినిమాకు సంబంధించిన వివరాలు చెప్తాను.