13-07-2025 01:01:51 AM
కారుతో ఢీకొట్టించిన అల్లుడు
సిద్దిపేట క్రైం, జూలై 12: అప్పులు తీర్చేందుకు అత్త పేరున బీమా చేయిం చి, ఆమెను కారుతో ఢీకొట్టించి హత్య చేశాడు ఓ అల్లుడు. పోలీసులు చేపట్టిన విచారణలో అసలు విషయం బయటపడటంతో జైలుపాలయ్యాడు. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో కమిషనర్ డాక్టర్ అనురాధ ఆ వివరాలు వెల్లడించారు. తొగుట మం డలం పెద్దమాసన్‌పల్లికి చెందిన తాళ్ల వెంకటేష్ పౌల్ట్రీ రైతు.
వ్యాపారంలో నష్టం రావడంతో రూ.22 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో, వాటిని తీర్చడానికి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకు గతంలో తాను రూ.1.30 లక్షలు అప్పు ఇచ్చిన తన మిత్రుడు తాళ్ల కరుణాకర్ అనే వ్యక్తితో కలిసి వెంకటేష్ హత్యకు పథకం పన్నాడు.
సిద్దిపేటలో నివాసం ఉంటున్న దివ్యాంగురాలైన తన అత్తమ్మ తాటికొండ రామమ్మ(50) పేరుతో ఈ సంవత్సరం మార్చిలో పోస్టాఫీసులో సంవత్సరానికి రూ.755 లెక్కన చెల్లించి రూ.15 లక్షల ఇన్సూరెన్సు, ఎస్బీఐలో రూ.2,000 చెల్లించి రూ.40 లక్షల ప్రమాద బీమా చేయించాడు. అంతేకాకుండా తన మిత్రుడైన తాళ్ల కరుణాకర్ తండ్రి పేరు మీద ఉన్న 28 గుంటల భూమిని కూడా అత్త పేరిట మార్పించాడు.
తన అత్త చనిపోతే రూ.5 లక్షలు రైతుబీమా వస్తుందని నమ్మబలికి, ఆమెను కారుతో గుద్దించి చంపాలని సూచించాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి బీమా డబ్బులు పొందవచ్చని, అందులో చెరో సగం తీసుకుందామని పథకం వేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 7న సిద్దిపేట నుంచి కరుణాకర్ కారును అద్దెకు తెచ్చాడు. వెంకటేష్ తన ద్విచక్ర వాహనంపై రామవ్వను తీసుకొని తుక్కాపూర్ గ్రామంలో పొలం వద్దకు వెళ్లాడు.
ఆమెను రోడ్డు పక్కన కూర్చోబెట్టి కరుణాకర్‌కు ఫోన్ చేశాడు. కరుణాకర్ కారుతో వచ్చి రామవ్వను ఢీ కొట్టాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు నటించిన వెంకటేష్, గుర్తుతెలియని వాహనం ఢీకొని తన అత్త మృతి చెందిందని తొగుట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గసీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.