13-07-2025 12:45:05 AM
ఇది ఒక సంప్రదాయం.. ఒక జీవనోపాధిసిద్దిపేట బ్రాండ్ గొల్లభామ చీర
ఇది ఒక సంప్రదాయం.. ఒక జీవనోపాధి
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా గొల్లభామ చీరలకు పెట్టింది పేరు. గొల్లభామ వయ్యారి నడకతో చీరను తీర్చిదిద్దడం సిద్దిపేట నేత కార్మికుల ప్రత్యేకత. చీరలపై చక్కటి డిజైన్లు, ప్రకృతి శైలిలో నేత, వాటికి కొత్త రూపాన్నివ్వడంలో చాతుర్యం, ఇవన్నీ గొల్లబామ చీరలకు ప్రత్యేకతను తీసుకువచ్చాయి.
గొల్లబామ చీరలలో ప్రధానంగా కాటన్ లేదా కాటన్ -సిల్క్ మిశ్రమం వాడుతారు. వాటి డిజైన్లలో నలుపు, ఎరుపు, ఆకుపచ్చ వంటి సాంప్రదాయమైన రంగుల పాళ్లు ఉండటం వల్ల మహిళలు ఈ చీరలు ఎంతగానో ఇష్టపడుతారు. చీరలపై కనిపించే గొల్లబామ పూల మోటిఫ్ ఒక చిహ్నంగా మారింది. గ్రామీణ జీవన శైలికి దగ్గరగా ఉండే ఈ చీరల డిజైన్ తరతరాలుగా కొనసాగుతున్నది.
ఈ చీరల తయారీకి కావలసిన ముడి సరుకులు.. జరి, రంగులు, యంత్రాలు రానురాను ఖరీదయ్యాయి. పాత మగ్గాల మరమ్మత్తుకు ఖర్చులు పెరగడం, యువత ఈ వృత్తి వైపు రాకపోవడం, మార్కెటింగ్ లోపం, మధ్యవర్తుల అధిక లాభాలు ఇవన్నీ గొల్లబామ నేత కార్మికులకి ప్రధాన సమస్యలుగా మారాయి. అంతేకాకుండా యాంత్రికంగా చీరల తయారీ పెరిగి, వాటితో పోటీపడలేక గొల్లబామ చీరల ఉత్పత్తిదారుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నది.
ప్రోత్సాహకాలు..
గొల్లబామ చీరలకు గణనీయమైన గుర్తింపు లభించింది. తెలంగాణ ప్రభుత్వ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటికి ప్రోత్సాహం లభిస్తూన్నది. ఎగ్జిబిషన్‌లలో గొల్లబామ చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొన్ని చీరలకు జాతీయ హస్తకళ పురస్కారాలు లభించాయి. పలువురు కార్మికులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు.
భవిష్యత్తు దిశగా..
గొల్లబామ చీరలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడానికి ప్రత్యేక బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఈ భాగస్వామ్యం వంటి చర్యలు అవసరం. ప్రభుత్వాలు, ఫ్యాషన్ డిజైనర్లు కలిసి ఈ సంప్రదాయాన్ని నూతన శైలిలో ప్రపంచానికి పరిచయం చేయాలి. గొల్లబామ చీర ఒక సంప్రదాయం మాత్రమే కాదు, అది ఒక జీవనోపాధి, ఒక గౌరవం, ఒక కథ. దాన్ని కాపాడడం మన అందరి బాధ్యత.
మంద జనార్దన్,
సిద్దిపేట (విజయక్రాంతి)
ఉపాధి పరిస్థితి..
ప్రస్తుతం ఈ వృత్తిలో 150 నుంచి 200 మంది నేత కార్మికులు నేరుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు రంగులు రంగరించేవాళ్లు, మార్కెటింగ్‌లో సహకరిస్తున్న వారు కలిపి సుమారు 300 మందికి పైగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీటి తయారీకి మహిళల చేయూత ఎంతగానో అవసరం. ముఖ్యంగా రంగుల ఎంపిక, తరుగుతో మేళవింపు వంటి పనుల్లో వారు చురుకుగా పాల్గొంటున్నారు.
నాన్న నుంచి నేర్చుకున్న..
గొల్లభామ చీరలు నేయడం నాన్న నుంచి నా చిన్నతనంలోనే నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి వస్త్రం నేయడం పాషన్‌గా పనిచేస్తాను. గొల్లభామ చీర నేయడానికి 3 నుంచి 5 రోజులు పడుతుంది. ఒక చీర నేస్తే రూ.1800 కూలి లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలని ముగ్ధుల్ని చేసిన గొల్లభామ చీర నేసిన ఘనత సిద్దిపేట చేనేత కార్మికులకు దక్కింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది.
ఎక్కలదేవి కైలాసం, చేనేత కార్మికుడు, సిద్దిపేట
కార్మికులు కనుమరుగవుతున్నారు..
మానవ మనుగడకు మూలం చేనేత వృత్తి. ఈ వృత్తిలో కార్మికులు కనుమరుగవుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చేనేత వృత్తిని పట్టించుకోవడం లేదు. రోజుకి రూ. 200 మాత్రమే కూలి దొరుకుతున్న ఈ రంగాన్ని ఎంచుకోవడానికి నేటి యువత ఆసక్తి చూపడం లేదు. ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి చేనేత రంగాన్ని బతికించాల్సిన అవసరం ఉంది. గొల్లభామ చిత్రాలతో వస్త్రం నేయాలంటే రోజుకి ఒక మీటర్ మాత్రమే సాధ్యమవుతుంది. ముడిసరుకుల ధరలు పెరిగి చేనేత వృత్తి ఉపాధికి దూరమవుతున్నది. కార్మికుల శ్రమకు తగిన వేతనం లభించకపోవడం ప్రధాన కారణం.
బుగ్గ శ్రీరాములు,
చేనేత కార్మికుడు, సిద్దిపేట