calender_icon.png 13 July, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం గేట్లు మూసివేత

13-07-2025 01:11:06 AM

- రెండింటిని బంద్ చేసిన అధికారులు

-ఒక గేటు ద్వారా సాగర్‌కు విడుదల

-భద్రాచలంలో తగ్గిన గోదావరి వరద

నాగర్‌కర్నూల్, జూలై 12 (విజయక్రాంతి)/భద్రాచలం: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి 1,39,297 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 39,170 క్యూసెక్కుల వరద శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు గత మూడు రోజులుగా మూడు క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయగా శనివారం రెండు గేట్లను మూసి కేవలం ఒక గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో భారీ ఎత్తున యాత్రికులు, భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

భద్రాద్రిలో తగ్గిన నీటి మట్టం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గడంతో అధికారులు, పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు రోజులుగా ఉధృతంగా పెరిగిన గోదావరి వరద శనివారం మధ్యాహ్నం నుంచి శాంతించింది. భద్రాచలం వద్ద మధ్యాహ్నం ఒంటి గంటకు 41.30 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం సాయంత్రం ఐదు గంటల వరకు నిలకడగా 41.30 అడుగులు ఉంది. ఆ తర్వాత నుంచి తగ్గుతూ రాత్రి 7 గంటలకు 41 అడుగులకు చేరుకుంది. భద్రాచలం ఎగువనున్న పేరూరు వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో భద్రాచలంలో కూడా రాత్రి నుంచి వరద తగ్గుముఖం పడుతుందని అధికారులు పేర్కొన్నారు.