calender_icon.png 13 October, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలకుల విధానాలపై మేధావుల ఆందోళన

13-10-2025 12:38:24 AM

-ఆదివాసీల అణచివేత నుంచి ఎన్నికల అక్రమాల వరకు నిలదీత

-ప్రజాస్వామ్యం, మానవ హక్కులు ఎదుర్కొంటున్న సవాళ్లపై మేధోథనం

-సంస్మరణ సభలో మానవ హక్కుల నేత బాలగోపాల్‌కు ఘన నివాళి

హైదరాబాద్,సిటీ బ్యూరో అక్టోబర్ 12 (విజయక్రాంతి) : బస్తర్ ఆదివాసీల హక్కుల నుంచి మొదలుకొని, భూ దోపిడీ, ఎన్నికల వ్యవస్థ, వ్యక్తిగత గోప్యత వంటి కీలక అంశాలపై మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు అనుసరిస్తున్న విధనాలపై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రముఖ మానవ హక్కు ల నేత కె. బాలగోపాల్ 16వ సంస్మరణ సభ ను ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. పలువురు ప్రముఖ విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ఈసందర్భంగా మానవ హక్కుల నేతకు ఘనంగా నివాళులర్పించారు. దేశం లో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సభ మేధోమథనానికి వేదికగా నిలిచింది. 

బస్తర్‌ను అంతర్గత వలసగా మార్చారు : నందిని సుందర్

స్వదేశీ పాలకులే బస్తర్‌ను ఒక అంతర్గత వలసగా మార్చి, అక్కడి వనరులను దోచుకుంటున్నారని ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫె సర్ నందిని సుందర్ ఆవేదనవ్యక్తం చేశారు. బస్తర్ ఎవరిది? ఆదివాసీల భవిష్యత్తు ఏం కానున్నది అనే అంశంపై ఆమె మాట్లాడారు. బస్తర్‌లోని ఆదివాసీల అస్తిత్వాన్ని ప్రభుత్వమే ప్రశ్నార్థకం చేస్తోందని ఆరోపించారు. ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడానికి, గత ఐదేళ్లలో విచ్చలవిడిగా సీఆర్‌పీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి ఆదివాసీలపై హత్యాకాండను కొనసాగిస్తున్నారని విమర్శించారు. స్థానిక యువతకు కేవలం పోలీ సు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి, వారి చేతే వారి ప్రజలను అణచివేయిస్తున్నారని ఆరోపించారు. 

కొత్త తరహా భూ దోపిడీ : పీ.ఎస్. అజయ్ కుమార్

పాలకులు కొత్త తరహా భూ దోపిడీకి తెరలేపారని ఆల్ ఇండియా లాయర్స్ అసోసి యేషన్ ఫర్ జస్టిస్ నాయకులు పి.ఎస్. అజయ్ కుమార్ మండిపడ్డారు. పట్టాలు, ఆధారాలు లేని భూమి ప్రభుత్వానిదేనం టూ కొత్త వాదనతో ఆదివాసీలు, నిరక్షరాస్యులు, మహిళల భూములను లాక్కుంటు న్నారని ఆరోపించారు. ప్రభుత్వం భూమికి సంరక్షకుడిగా కాకుండా యజమానిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సొంత భూమి లోనే పేదలను కౌలుదారులుగా మార్చే దుస్థితిని ప్రభుత్వమే కల్పిస్తోంది, అని ఆయన అన్నారు.

ఎన్నికల ప్రజాస్వామ్యంపై దాడి : యోగేంద్ర యాదవ్

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడు లు జరుగుతున్నాయని స్వరాజ్ అభియాన్ నాయకులు యోగేంద్ర యాదవ్ తెలిపారు. ఒకే దేశం-.. ఒకే ఎన్నిక.. నియోజకవర్గాల పునర్విభజన వంటివన్నీ ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకునే కుట్రలో భాగమే. ఓటరే తన గుర్తింపును నిరూపించుకోవాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించి, విపక్ష ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. . భారతదేశం క్రమంగా ఎలక్టోరల్ ఆటోక్రసీ ఎన్నికల నిరంకుశత్వం వైపు పయనిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాదంలో వ్యక్తిగత గోప్యత : అపర్ గుప్తా

కృత్రిమ మేధ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వల్ల వ్యక్తిగత గోప్యతకు భద్రత లేకుండా పోతోందని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు అపర్ గుప్తా అన్నారు. నిరంతర నిఘా వల్ల వ్యక్తి స్వాతంత్య్రం ప్రశ్నార్థకంగా మారుతోందని, దీనికి ప్రభుత్వమే ఇతోధికంగా తోడ్పడుతోందని విమర్శించారు. అనంతరం కె. బాలగోపాల్ రచించి న రాజ్యాంగాన్ని ఎలా చూడాలి అనే పుస్తకాన్ని వక్తలు ఆవిష్కరించారు.

ఈ పుస్తకాన్ని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. సుధ సభకు పరిచయం చేశారు. అనంతరం పాలస్తీనాపై ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్. జీవన్ కుమార్, డాక్టర్ ఎస్. తిరుపతయ్య, వేమన వసంత లక్ష్మి, వై. రాజేష్, వి. ఎస్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.