13-10-2025 12:41:30 AM
-ప్రక్షాళన దిశగా అధిష్టానం
-సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరీశీలకుల పర్యటన
-అభిప్రాయాలు సేకరించిన అబ్జర్వర్లు
-ఆశావహుల్లో నెలకొన్న టెన్షన్
సంగారెడ్డి, అక్టోబర్ 12 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో మళ్లీ డీసీసీ అధ్యక్షుల నియామక వేడి మొదలైంది. ఏఐసీసీ నుంచి పరిశీలకులు జిల్లాల పర్యటన చేసి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలో పరిశీలకులు అభిప్రాయ సేకరణ చేపట్టారు. గతంలో కూడా అనేకసార్లు డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో పార్టీలో ప్రక్రియ జరిగినప్పటికీ ముందడుగు పడకపోవడం గమనార్హం. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ నుంచి పరిశీలకుల రాక ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆద్యంతం ఆసక్తికరం..
కాంగ్రెస్లో ఏఐసీసీ నుంచి నేరుగా పరిశీలకులు రావడంతో ఎవరినైనా మేనేజ్ చేసి తమ పేరును పరిశీలకుడి ముందు గట్టిగా చెప్పించాలనుకునే ప్రయత్నాలకు ఎక్కడ కూడా అవకాశాలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. ప్రధానంగా ఈ కమిటీలకు పార్టీలో ముందుగానే శిక్షణ ఇచ్చి అభిప్రాయ సేకరణ ఏ విధంగా చేపట్టాలని పార్టీ దిశానిర్దేశం చేసిందని పేర్కొంటున్నారు. దీంతోనే ఈ ప్రక్రియపై ఇప్పుడు పార్టీలో అందరి దృష్టి నెలకొంది. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో క్షేత్ర స్థాయిలో పర్యటించనుండటంతో పార్టీలో ఇది ఆసక్తికరంగా మారింది.
ప్రధానంగా బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి వారి అభిప్రాయం సేకరించనుండటంతో ఇప్పుడు ఆశావహుల్లో టెన్షన్ కనిపిస్తోంది. కేవలం కార్యకర్తల నుంచే కాకుండా వ్యాపారులు, వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులను కూడా కలిసి అభిప్రాయ సేకరణ చేయనున్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో ఆశావహులు ఎవరినైనా మేనేజ్ చేసి తమ పేరును పరిశీలకుడి ముందు గట్టిగా చెప్పించాలనుకునే ప్రయత్నాలకు ఎక్కడ కూడా అవకాశాలు ఉండకపోవచ్చని చెప్పుకుంటున్నారు. ప్రధానంగా ఈ కమిటీలకు పార్టీలో ముందుగానే శిక్షణ ఇచ్చి అభిప్రాయ సేకరణ ఏ విధంగా చేపట్టాలని పార్టీ దిశానిర్దేశం చేసిందని పేర్కొంటున్నారు. దీంతోనే ఈ ప్రక్రియపై ఇప్పుడు పార్టీలో అందరి దృష్టి నెలకొంది.
ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల వేడి..
ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొని ఉంటుండగా కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుల వేడి మొదలైంది. ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏఐసీసీ నియమించిన పార్టీ పరిశీలకులు సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగానే మెదక్ జిల్లాలో ఏఐసీసీ అబ్జర్వర్ జ్యోతి రౌతేలా, సంగారెడ్డిలో జరితా లైప్త్లాంగ్ పర్యటించి సమావేశాలు నిర్వహించారు. దీంతో డీసీసీ అధ్యక్షుల కోసం పోటీ పడే ఆశావహులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. మండల, నియోజకవర్గ స్థాయి నాయకులతో మమేకమవుతూ తమ పేరును ప్రతిపాదించాలని అంతర్గతంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. దీంతో ఉమ్మడి జిల్లాలో డీసీసీ ఎన్నిక వేడి మొదలైంది.